Begin typing your search above and press return to search.

జల్లికట్టు ఎద్దును మళ్లీ కట్టేశారు

By:  Tupaki Desk   |   12 Jan 2016 9:36 AM GMT
జల్లికట్టు ఎద్దును మళ్లీ కట్టేశారు
X
చాలాకాలంగా జల్లికట్టుపై ఉన్న నిసేధాన్ని కేంద్రం ఎత్తేయడంతో సంబరాలు జరుపుకొన్న తమిళనాడు ప్రజల ఉత్సాహం చప్పున చల్లారింది. తాజా సుప్రీంకోర్టు బ్రేకులు వేయడంతో తమిళులంతా ఒక్కసారిగా చప్పబడిపోయారు. క్రూరమైన జంతు హింస కిందకు వచ్చే జల్లికట్టు పోటీలను కేంద్ర ప్రభుత్వం అనుమతించడంపై న్యాయస్థానం మంగళవారం స్టే విధించింది.

జల్లికట్టుపై గతంలో సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని కేంద్రం ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. దీంతో తమిళనాడులో సంబరాలు చేసుకున్నారు. జంతు పరిరక్షణ సంస్థతో పాటు పలువురు కేంద్రం తీరుపై మండిపడుతూ జల్లి కట్టును నిషేధించాలని విజ్ఞప్తి చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం...జల్లికట్టు అనుమతిపై స్టే విధిస్తూ కేంద్రానికి, తమిళనాడు సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. దీంతో సంక్రాంతి జల్లికట్టు నిర్వహణ సందేహమే.

కాగా ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి భానుమతి విచారణ జరపలేనంటూ తప్పుకొన్నారు. తాను మద్రాసు హైకోర్టులో పనిచేశానని... విచారణ నుంచి తప్పుకొంటానని ఆమె ప్రకటించారు. ధర్మాసనంలోని న్యాయమూర్తి హఠాత్తుగా తప్పుకోవడంతో ఒక్కసారిగా అనిశ్చితి ఏర్పడింది. దీంతో ఆ కేసునే విచారించి మరో ధర్మాసనం దాన్ని స్వీకరించి స్టే ఇచ్చింది. కాగా తమిళనాడులో ఒత్తిడులు ఉండొచ్చన కారణంతోనే న్యాయమూర్తి తప్పుకున్నారన్న వాదన ఒకటి వినిపిస్తోంది.