Begin typing your search above and press return to search.

ఎస్సీ.. ఎస్టీ చ‌ట్టం తీర్పుపై స్టేకు సుప్రీం నో

By:  Tupaki Desk   |   3 April 2018 4:54 PM IST
ఎస్సీ.. ఎస్టీ చ‌ట్టం తీర్పుపై స్టేకు సుప్రీం నో
X
ఒక తీర్పుకు నిర‌స‌న‌గా దేశ వ్యాప్తంగా బంద్ జ‌ర‌గ‌టం.. ఈ సంద‌ర్భంగా చోటు చేసుకున్న హింస‌.. అల్ల‌ర్ల‌కు ఏకంగా 9 మంది మ‌ర‌ణించ‌టం లాంటి సంచ‌ల‌నాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి వేళ‌.. దేశ వ్యాప్తంగా శాంతిభ‌ద్ర‌త‌ల మీద బోలెడ‌న్ని సందేహాలు వెల్లువెత్తుతున్న వేళ‌.. తన తీర్పుపై సుప్రీం ఎలా స్పందిస్తుంద‌న్న‌ది స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ స‌స్పెన్స్ కు తెర దించుతూ అత్యున్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఎస్సీ.. ఎస్టీ చ‌ట్టంలో తాను సూచించిన మార్పుల‌ను ఎత్తివేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ విచార‌ణ‌కు సుప్రీం నో చెప్ప‌టం తెలిసిందే. త‌ను వెలువ‌రించిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నో చెప్పేసింది.

తాను ఇచ్చిన తీర్పు అమాయ‌కుల్ని కాపాడేందుకేన‌న్న సుప్రీం.. మార్చి 20న తానిచ్చిన తీర్పును ప్ర‌స్తుతం ఆందోళ‌న చేస్తున్న వ‌ర్గాల వారు క‌నీసం చ‌దివిన‌ట్లుగా కూడా క‌నిపించ‌టం లేదంటూ వ్యాఖ్య‌లు చేసింది. అంతేకాదు.. తాజాగా చోటు చేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై త‌న‌దైన శైలిలో స్పందిస్తూ.. కొన్ని సంద‌ర్భాల్లో స్వార్థ శ‌క్తులు కూడా జోక్యం చేసుకున్న‌ట్లుగా పేర్కొంది. ఎస్సీ.. ఎస్టీ వేధింపుల నిరోద‌క చ‌ట్టం అమ‌లు విష‌యంలో కొన్ని సంద‌ర్భాల్లో అమాయ‌కుల్ని క‌ట‌క‌టాల వెనుక్కు నెట్టటంపైనే త‌మ ఆందోళ‌నంతా అని వ్యాఖ్యానించింది. ఈ చ‌ట్టం ప‌ట్ల త‌మ‌కు ఎలాంటి వ్య‌తిరేక‌త లేద‌ని తేల్చి చెప్పింది. ఫిర్యాదును స‌రిగా చూడ‌కుండా వ్య‌క్తులు అరెస్ట్ కావాల‌ని ప్ర‌భుత్వం ఎందుకు కోరుకుంటుందో చెప్పాల‌ని న్యాయ‌స్థానం ప్ర‌శ్నించింది. ఉత్త‌రాది మొత్తం అట్టుడికిపోయిన తీర్పుపై సుప్రీం స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేయ‌టం గ‌మ‌నార్హం.