Begin typing your search above and press return to search.

వివేకా మ‌ర్డ‌ర్.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి సుప్రీం షాక్!

By:  Tupaki Desk   |   19 Sep 2022 10:31 AM GMT
వివేకా మ‌ర్డ‌ర్.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి సుప్రీం షాక్!
X
మాజీ మంత్రి, క‌డ‌ప మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చింది. ప్ర‌స్తుతం వివేకా హ‌త్య కేసును సీబీఐ ద‌ర్యాప్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే విచార‌ణ స‌రిగా జ‌ర‌గ‌డం లేదంటూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ విచార‌ణ‌ను వేరే రాష్ట్రానికి బ‌దిలీ చేయాలని కోరారు.

ఈ హ‌త్య కేసులో ఉన్న నిందితులంతా ప్ర‌స్తుతం బెయిల్ పైన బ‌య‌ట ఉన్నార‌ని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మేర‌కు సునీత త‌ర‌ఫున ప్ర‌ముఖ న్యాయ‌వాది సిద్ధార్థ లూత్రా వాద‌న‌లు వినిపించారు. నిందితులు బెయిల్ పై బ‌య‌ట‌కొచ్చి సాక్షుల‌ను బెదిరిస్తున్నార‌ని తెలిపారు.

అంతేకాకుండా సాక్ష్యాల‌ను చెరిపేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని న్యాయ‌స్థానం దృష్టికి తెచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా వైఎస్ వివేకా హ‌త్య కేసులో ఎలాంటి స‌హ‌కారం అందించ‌డం లేద‌ని తెలిపారు. అందువ‌ల్ల సీబీఐ విచార‌ణ‌ను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల‌ని కోరారు. విచారణను తెలంగాణ హైకోర్టు పరిధిలోని ట్రయల్‌ కోర్టుకు మార్చాలని సునీత‌ విజ్ఞప్తి చేశారు.

సునీత వేసిన ఈ పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు... జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారి ధర్మాసనం విచారణ చేపట్టింది. సునీత త‌ర‌ఫు న్యాయ‌వాది సిద్ధార్థ లూత్రా వాద‌న‌ల‌పై స్పందించిన న్యాయస్థానం.. సునీత లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలంటూ సీబీఐ, జ‌గ‌న్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం అక్టోబర్‌ 14కు వాయిదా వేసింది.

కాగా.. 2019 మార్చిలో సొంత ఇంటిలోనే వైఎస్ వివేకా హ‌త్య‌కు గుర‌య్యారు. ముందు గుండెపోటు అని వైఎస్సార్సీపీ నేత‌లు చెప్పారు. ఆ త‌ర్వాత టీడీపీ నేత‌లు హ‌త్య చేశార‌ని ఆరోపించారు. అయితే ఈ హ‌త్య వెనుక క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి, వైఎస్ జ‌గ‌న్ భార్య భార‌తి మేన‌మామ వైఎస్ భాస్క‌ర‌రెడ్డి ఉన్నార‌ని వివేకా కుమార్తె సునీత ఆరోపిస్తున్నారు.

2019 మేలో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం సీబీఐ విచార‌ణ కోర‌డానికి నిరాక‌రించింది. దీంతో హైకోర్టును ఆశ్ర‌యించ‌డం ద్వారా సునీత త‌న తండ్రి మ‌ర‌ణంపై సీబీఐ విచారించేలా ఉత్త‌ర్వులు పొంద‌గ‌లిగారు. క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడు దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డిని సీబీఐ ఇప్ప‌టికే అరెస్టు చేసింది. అయితే ఆయ‌న బెయిల్ పై ఇటీవ‌ల విడుద‌ల‌య్యారు. మ‌రోవైపు అప్రూవ‌ర్లుగా మారిన ప‌లువురు సీబీఐ ఒత్తిడితోనే తాము ఇలా చెప్పామ‌ని ఫ్లేటు ఫిరాయించారు. సీబీఐ అధికారుల‌ను బెదిరించ‌డం, వారిపైనే కేసులు న‌మోదు చేయ‌డం వంటివి చేశారు. దీంతో సునీత ఈ కేసు విచార‌ణ ఏపీలో స‌రిగా జ‌ర‌గ‌ద‌ని.. వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల‌ని సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.