Begin typing your search above and press return to search.

ఎన్నికల కమిషన్‌ కు సుప్రీం షాక్ .. ఆ లెక్క తేలాల్సిందే ?

By:  Tupaki Desk   |   14 Dec 2019 11:36 AM IST
ఎన్నికల కమిషన్‌ కు సుప్రీం షాక్ .. ఆ లెక్క తేలాల్సిందే ?
X
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజార్టీ సాధించి రెండో సారి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగ లేదని అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ పరిశీలించిన సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ కి నోటీసులు జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చోటు చేసుకున్న అవకతవకల పై విచారణ జరపాల్సిందిగా శుక్రవారం దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ కు నోటీసులు జారీ చేసింది.

దాదాపు 347 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యకు, పోలైన ఓట్లకు మధ్య తేడాలు ఉన్నాయని, దీని పై విచారణ జరపాలని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌ (ఏడీఆర్‌), కామన్‌ కాజ్‌ అనే రెండు స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టు ను ఆశ్రయించాయి. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఇలాంటి తేడాలు రాకుండా ఓ పటిష్టమైన పద్ధతి రూపకల్పనకు ఎన్నికల కమిషన్‌ ను ఆదేశించాలని వీరు సుప్రీం కోర్ట్ ని కోరారు.

అలాగే ఎన్నికల ఫలితాలను ప్రకటించే ముందుగా అంకెలను ఎన్నికల కమిషన్‌ స్పష్టంగా లెక్క కట్టాలని , 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల పత్రాలు 17సీ, 20, 21సీ, 21డీ, 21ఈల సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచాని ఏడీఆర్‌ కోరింది. దేశవ్యాప్తంగా ఎన్నికల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు పిటిషన్‌ వేసుకునేందుకు అవకాశముండగా, ఫలితాల కచ్చితత్వం, అంకెల్లోని తేడాల కారణంగా వచ్చే అనుమానాలను తీర్చేందుకు మాత్రం ఎలాంటి ఏర్పాట్లూ లేవని ఏడీఆర్‌ సుప్రీంకోర్టు కి తెలిపింది.