Begin typing your search above and press return to search.

కరోనా పరిహారం ఇంకెప్పుడు .. కేంద్రం పై సుప్రీం సీరియస్

By:  Tupaki Desk   |   4 Sept 2021 11:00 AM IST
కరోనా పరిహారం ఇంకెప్పుడు .. కేంద్రం పై సుప్రీం సీరియస్
X
కరోనా వైరస్ మహమ్మారి తో మరణించిన వారి కటుంబాలకు పరిహారం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ వేవ్స్ ముగుస్తున్నా కూడా పరిహారంపై ఇంకెప్పుడు మార్గదర్శకాలను సిద్ధం చేస్తారని ముక్కుసూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వం మార్గదర్శకాలను తయారు చేసే సరికి కరోనా వైరస్ థర్డ్ వేవ్ కూడా అయిపోయేటట్టుందని అసహనం వ్యక్తం చేసింది.

ఈ మేరకు పరిహారం మార్గదర్శకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై ఇవాళ జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్ ల ధర్మాసనం విచారణ జరిపింది. తాము ఆదేశాలు ఇచ్చినప్పటికీ పరిహారం, మరణ ధృవీకరణ పత్రాల జారీకి మార్గదర్శకాలు రూపొందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా మరణాలకు సంబంధించి మరణ ధృవీకరణ పత్రాల జారీ కోసం మార్గదర్శకాలను రూపొందించాలని చాలా రోజుల కిందటే ఆదేశాలు ఇచ్చామని, వాటిని ఇప్పటికే ఒకసారి పొడిగించినట్లు సుప్రీం తెలిపింది.

అంతేగాక, కరోనాతో మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని తాము జూన్ 30న ఇచ్చిన ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. ఆ గడువు సెప్టెంబర్ 8తో ముగియనున్న నేపథ్యంలో ఆ సమయంలోగా పరిహారం చెల్లింపుపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. వీటికి సంబంధించి సెప్టెంబర్ 11లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలన్నీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.

పరిహారం విషయంలో తీసుకుంటున్న చర్యలపై వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా, గత నెల 16న జరిగిన విచారణ సందర్భంగా.. కరోనా మరణాల పరిహారానికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనకు కేంద్రానికి సుప్రీంకోర్టు 4 వారాల గడువునిచ్చింది. అయితే అందుకు తీసుకుంటున్న చర్యలను రెండు వారాల్లోనే చెప్పాలని ఆదేశించింది. ఇది ఇలావుండగా, భారతదేశంలో కరోనా కేసుల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. మరోవైపు కరోన థర్డ్ వేవ్ ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.