Begin typing your search above and press return to search.

విమాన టికెట్ల డబ్బు తిరిగి చెల్లించండి .. సుప్రీంకోర్టు

By:  Tupaki Desk   |   2 Oct 2020 5:40 PM IST
విమాన టికెట్ల డబ్బు తిరిగి చెల్లించండి .. సుప్రీంకోర్టు
X
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రద్దు చేయబడిన విమానాల కోసం ముందే టిక్కెట్ లు బుక్ చేసుకున్న ప్రజలకు డబ్బులు తిరిగి ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విమానయాన సంస్థలను ఆదేశించింది. ప్రయాణికుల వద్ద ఎలాంటి క్యాన్సిలేషన్ చార్జీలు వసూలు చేయకూడదని తెలిపింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్, టికెట్ ఛార్జీలను తిరిగి చెల్లించాలని డీజీసీఏ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

దేశీయ, అంతర్జాతీయ విమానాల టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఈ తీర్పు వర్తిస్తుందని న్యాయస్థానం తెలిపింది. మొదటి లాక్‌ డౌన్ సమయంలో ఒక ప్రయాణికుడు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం టికెట్ బుక్ చేసుకుంటే ఎయిర్ లైన్స్ రద్దు ఛార్జీలు వసూలు చేయకుండా పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. అది కూడా ప్రయాణికుడు టికెట్ రద్దు కోసం అభ్యర్థించిన తేదీ నుండి మూడు వారాల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ టికెట్ ఛార్జీ చెల్లించలేని స్థితిలో విమానయాన సంస్థ ఉంటే క్రెడిట్ రశీదు చెల్లించాలని ఆదేశించింది. 2021, మార్చి 31వ తేదీలోపు దీన్ని ఉపయోగించుకునే వీలు కల్పించాలని తెలిపింది. అలాగే ఏజెంట్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నవారికి కూడా ఈ డబ్బు చేరేలా చూడాలని విమానయాన సంస్థలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.