Begin typing your search above and press return to search.

లేడీ ఎఫ్ ఆర్వో పై టీఆర్ ఎస్ నేత దాడి... సుప్రీంకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   20 July 2019 2:32 PM IST
లేడీ ఎఫ్ ఆర్వో పై టీఆర్ ఎస్ నేత దాడి... సుప్రీంకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం
X
తెలంగాణ‌లో లేడీ ఎఫ్ ఆర్వో పై టీఆర్ ఎస్ నేత దాడి సంఘ‌ట‌న‌పై సుప్రీంకోర్టు సీరియ‌స్‌ గా స్పందించింది. ఇది శాంతిభ‌ద్ర‌త‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌గా పేర్కొన్న సుప్రీం ఈ కేసును స్వ‌యంగా తామే విచారిస్తామ‌ని పేర్కొంది. ఇటీవ‌ల కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌ నగర్ మండలం కొత్తసార్సాల గ్రామ పరిధిలో అటవీభూములను చదును చేసేందుకు వచ్చిన అధికారులపై పోడు రైతులు దాడి చేశారు. ఈ దాడికి సిర్పూర్ కాగ‌జ్‌ న‌గ‌ర్ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప సోద‌రుడు, జెడ్పీ వైస్‌ చైర్మన్ కోనేరు కృష్ణారావుతోపాటు, మరి కొంద‌రు రైతులు క‌ర్ర‌ల‌తో దాడి చేసి అట‌వీ అధికారుల‌ను గాయ‌ప‌రిచారు.

ఈ క్ర‌మంలోనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ ఆర్వో) చోలె అనితకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది అధికారులు కూడా ఈ దాడిలో గాయ‌ప‌డ్డారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో అధికారుల ఫిర్యాదు మేర‌కు మొత్తం 12 మంది వివిధ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం సైతం తీవ్రంగా స్పందించింది. కృష్ణ సైతం త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

పర్యావరణానికి సంబంధించి కోర్టుకు సహాయకుడిగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు అనిత కేసును ఇటీవల సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే సీరియస్ అయిన సుప్రీం ఈ కేసును స్వయంగా తామే పర్యవేక్షిస్తామని... ఇది కేవలం పర్యావరణానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని... శాంతిభద్రతలకు సంబంధించిన అంశంగా చూడాలని వ్యాఖ్యానించింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

ఈ క్రమంలోనే సుప్రీం అటవీ అధికారుల మీద దాడి చేసి తిరిగి ఎస్సీ- ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి అధికారులకు రక్షణ లేకుండా చేస్తే చ‌ట్టాలు నీరుగారిపోతాయ‌ని కూడా పేర్కొంది. జస్టిస్ అరుణ్ మిశ్రా- దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయాన్ని విచారిస్తుందని, పిటిషన్ దాఖలు చేయాలని న్యాయవాది ఏడీఎన్ రావును కోరింది. ఇక ఈ కేసులో ఇప్ప‌టికే కాగ‌జ్‌ న‌గ‌ర్ డీఎస్పీతో పాటు రూర‌ల్ సీఐను స‌స్పెండ్ చేశారు. ఇక అనిత‌పై పెట్టిన ఎస్సీ- ఎస్టీ కేసుపై సుప్రీం సీరియ‌స్ అవ్వ‌డంతో పాటు స్టే విధించింది.