Begin typing your search above and press return to search.

ఆ రివ్యూ పిటిష‌న్ల విచార‌ణ‌కు సుప్రీం నిరాక‌ర‌ణ‌!

By:  Tupaki Desk   |   9 Oct 2018 2:06 PM IST
ఆ రివ్యూ పిటిష‌న్ల విచార‌ణ‌కు సుప్రీం నిరాక‌ర‌ణ‌!
X
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌హిళ‌ల స‌మాన‌త్వ‌పు హ‌క్కుకు భంగం క‌లిగించేలా ఉన్న ఆ నిబంధ‌న‌ను ఎత్తివేయాల‌ని సుప్రీం ఆదేశించింది. అయితే, ఆ తీర్పును స‌వాలు చేస్తూ రెండు సంస్థలు సుప్రీంలో రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేశాయి. ఆ తీర్పును కొట్టివేయాలని కోరుతూ నేషనల్‌ అయ్యప్ప డివోటీస్‌ అసోసియేషన్ - నాయర్‌ సర్వీస్‌ సొసైటీలు సుప్రీంలో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. సంతానం పొందగలిగే మహిళలపై తన ధ్యాస మళ్లకూడదని అయ్యస్వామి కోరుకున్నార‌ని పిటిష‌నర్లు కోర్టుకు విన్న‌వించారు. శాస్త్రీయ, హేతుబద్ధ కారణాలను సాకుగా చూపుతూ మ‌త విశ్వాసాలలో జోక్యం చేసుకోవడం సరికాద‌ని పిటిష‌న‌ర్లు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈ నేప‌థ్యంలో ఆ రివ్యూ పిటిష‌న్ల‌పై సుప్రీం నేడు స్పందించింది. ఆ రివ్యూ పిటిషన్లపై తక్షణమే విచార‌ణ జ‌ర‌ప‌డం కుద‌ర‌ద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. నిర్ధిష్ట సమయంలోనే రివ్యూ పిటిషన్ల విచార‌ణ జ‌రుగుతుంద‌ని, హ‌డావిడిగా వాటిపై విచార‌ణ జ‌ర‌ప‌లేమ‌ని సుప్రీం తేల్చి చెప్పింది. తీర్పుపై రివ్యూ పిటిషన్ల‌పై ఇప్పటికిప్పుడు విచార‌ణ జ‌ర‌ప‌లేమ‌ని తేల్చిచెప్పింది. మ‌రోవైపు, కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని, కోర్టు తీర్పును అమలు చేసేందుకు చర్యలు చేపడతామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ క్లారిటీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. లౌకిక స్ఫూర్తిని దెబ్బతీసేలా కొన్ని శక్తులు వ్యవహరిస్తున్నాయని విజ‌య‌న్ ఆరోపించారు. కాగా, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం తీర్పును పలు మహిళా సంఘాలు స్వాగతించగా, కొన్ని హిందూ సంస్ధలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.