Begin typing your search above and press return to search.

పోలింగ్ కు ముందు మోడీకి సుప్రీం షాకిచ్చిందిగా?

By:  Tupaki Desk   |   11 April 2019 10:41 AM IST
పోలింగ్ కు ముందు మోడీకి సుప్రీం షాకిచ్చిందిగా?
X
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరగనున్న తొలి దశ పోలింగ్ కు సరిగ్గా ఒక రోజు ముందు మోడీ సర్కారుకు ఇబ్బందికర పరిస్థితి చోటుచేసుకుంది. ఇంతకాలం మోడీ సర్కారుకు మచ్చగా మారిందన్న అభిప్రాయం ఉన్న రఫెల్ ఎపిసోడ్ లో మోడీ బ్యాచ్ కు ఎదురుదెబ్బ తగిలింది.

రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు సుప్రీం సానుకూలంగా స్పందించింది. దీనిపై మోడీ పరివారం మాత్రం భిన్నంగా స్పందిస్తూ.. లీకైన పత్రాల ఆధారంగా వేసిన కేసు కాబట్టి.. దీన్ని విచారించటానికి వీల్లేదంటూ చిత్రమైన వాదనను తెర మీదకు తె్చింది. రఫెల్ పత్రాలపై తమకు ప్రత్యేక హక్కులు ఉన్నాయంటూ కేంద్రం చేసిన వాదనను సుప్రీం తాజాగా రిజెక్ట్ చేసింది.

అసలేం జరిగిందన్న చూస్తే..

ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల్ని కొనాలన్నది ప్రభుత్వ ఆలోచన. దీని కోసం జరిగిన ఒప్పందంలో చీకటి కోణాలకు సంబంధించి కొన్ని పత్రాల్ని చూపిస్తూ.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాఫ్తు జరపాలంటూ గత ఏడాది సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు పిటిషనర్ల వాదనను కొట్టివేస్తూ.. డిసెంబరు14న తీర్పును ఇచ్చింది.

ఈ నేపథ్యంలో సుప్రీం ఇచ్చిన తీర్పును మరోసారి పున:సమీక్షించుకోవాలంటూ కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరి.. యశ్వంత్ సిన్హా.. ప్రశాంత్ భూషన్.. తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై మోడీ సర్కారు ఊహించని రీతిలో చిత్రమైన వాదనను తెరమీదకు తెచ్చింది.

పిటిషన్లు సమర్పించిన పత్రాలు.. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అక్రమంగా సేకరించారని.. వాటిని పిటిషనర్లు తమకు తగ్గట్లుగా ఉపయోగించుకున్నట్లుగా వాదనలు వినిపించింది. దీనిపై సుప్రీం తాజాగా రిజెక్ట్ చేస్తూ తీర్పును ఇవ్వటం మోడీ పరివారానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. తమ పాలనలో మెరుపులే తప్పించి మరకలు లేవని చెప్పే మోడీ మాటల్ని.. గతంలో మాదిరి ధీమాగా చెప్పే వీలు లేకుండా సుప్రీం మాటలు అడ్డు తగలటం ఖాయం. కీలకమైన ఎన్నికల వేళ ఇలాంటి పరిస్థితిని మోడీ లాంటి నేతకు ఎంతటి ఇబ్బందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.