Begin typing your search above and press return to search.

ఢిల్లీ అల్లర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం: పోలీసులను నిలదీత

By:  Tupaki Desk   |   26 Feb 2020 10:00 AM GMT
ఢిల్లీ అల్లర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం: పోలీసులను నిలదీత
X
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నాలుగు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై మండిపడింది. ఎడతెరపి లేకుండా హింస కొనసాగుతుండటం.. అల్లర్లలో రెండు మతాలకు చెందిన పౌరులు ప్రాణాలు కోల్పోతుండటం.. అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై మండిపడింది.
కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే ఢిల్లీ పోలీసులపై సుప్రీంకోర్టు నిప్పులుచెరిగింది.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో రెండు నెలలుగా కొనసాగుతున్న ధర్నాను వేరొక చోటికి తరలించాలనే పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఢిల్లీ అల్లర్లను ప్రస్తావించింది. షాహీన్ బాగ్ ధర్నా, ప్రస్తుత హింసకు సీఏఏనే నేపథ్యంగా ఉండటం, ప్రస్తుతం దేశ రాజధానిలో పరిస్థితి చాలా దారుణంగా ఉండడంతో ధర్నా చౌక్ తరలింపుపై ఇప్పటికిప్పుడు తాము తీర్పు చెప్పలేమని కోర్టు స్పష్టం చేసింది.

ఆ పిటిషన్ పై జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సీఏఏ విషయంలో కేంద్ర ప్రభుత్వం, నిరసనకారుల వాదనలు వేటికవే భిన్నంగా ఉన్నాయి, దేనిమీదైనా నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉందని న్యాయస్థానం గుర్తుచేసింది. అయితే ఆందోళనలతో ప్రజలు ఇబ్బంది పడొద్దని, ధర్నా పేరుతో రెండు నెలలుగా రోడ్లు బ్లాక్ చేయడం సరికాదని తెలిపింది. ఈ వివాదానికి న్యాయపరంగా కచ్చితమైన పరిష్కారం చూపించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుపై ఉందని పేర్కొంది. కాబట్టే తాము ‘ఔట్ ఆఫ్ బాక్స్' ఆలోచించి.. మధ్యవర్తుల్ని నియమించాం. ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా, ఫెయిలవుతుందా అనేది పక్కనపెడితే.. పరిస్థితుల్ని చక్కబెట్టడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. కానీ ఇలాంటి ప్రయత్నం పోలీసుల వైపు నుంచి జరగకపోవడంపై జస్టిస్ ఎస్‌కే కౌల్ అసహనం వ్యక్తం చేశారు.

ఢిల్లీ పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే.. చట్టప్రకారం పనిచేసి ఉంటే ఇవాళ 20 మంది ప్రాణాలు పోయేవి కావని, ఆస్తుల ధ్వంసం జరిగి ఉండేది కాదని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. కచ్చితంగా సమస్యంతా ఢిల్లీ పోలీసుల దగ్గరే ఉందని స్పష్టం చేసింది. ఒక్కరు కూడా నిబంధనల ప్రకారం నడుచుకోలేదని, స్వతంత్ర నిర్ణయాలు అసలే లేవని, పక్కనే నిలబడి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినవాళ్లను కూడా పోలీసులు పట్టుకోలేదని పేర్కొంది. అలాంటప్పుడు పరిస్థితి దిగజారకుండా ఉంటుందా? అని జస్టిస్ కౌల్ ప్రశ్నించారు. షాహీన్ బాగ్ ధర్నా కేంద్రం తరలింపుపై ఇప్పుడప్పుడే తీర్పు చెప్పలేమని, పరిస్థితులు చక్కబడ్డాక దానిపై విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మధ్యవర్తుల కమిటీ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు ఇప్పుడే ఇవ్వబోమని తేల్చిచెప్పింది. అనంతరం విచారణను మార్చి 23వ తేదీకి వాయిదా వేసింది.