Begin typing your search above and press return to search.

సుప్రీం దెబ్బ‌కు ఫిరాయింపుల‌పై అన‌ర్హ‌త‌?

By:  Tupaki Desk   |   22 Aug 2016 6:32 AM GMT
సుప్రీం దెబ్బ‌కు ఫిరాయింపుల‌పై అన‌ర్హ‌త‌?
X
ఫిరాయింపు ఎమ్మెల్యేల విష‌యంలో ఏం చేశారో చెప్పాల‌ని తెలంగాణ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారిని ఉద్దేశించి సుప్రీంకోర్టు నోటీసు జారీచేసిన నేప‌థ్యంలో కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్య‌ల‌పై దెబ్బ ప‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన అనర్హత పిటీషన్లు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పరిశీలనలో ఉన్నాయని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టుకు నివేదించనున్నార‌ని తెలుస్తున్న నేప‌థ్యంలో వారిపై చ‌ర్య‌లు ఉండొచ్చ‌ని తెలుస్తోంది.

తమ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టిఆర్‌ ఎస్‌ లో చేరడంతో - పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాల్సిందిగా తాము స్పీకర్ వద్ద పిటీషన్లు దాఖలు చేసినా, చర్య తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్‌ ను ఆదేశించాలంటూ కాంగ్రెస్ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టులో తమ వాదన వినిపించారు. ఈ పిటీషన్‌ ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు నోటీసు నేపథ్యంలో స్పీకర్ ఎస్.మధుసూదనా చారి శనివారం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి - న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి - అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్.రాజా సదారాంతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. మూడు వారాల్లోగా సమాధానం చెప్పాల్సిందిగా సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశించినందున, హాజరై అంశం పిటీషన్లు స్పీకర్ పరిశీలనలో ఉన్నట్లు తెలియజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్ళనున్నారు. అనర్హత పిటీషన్లపై ఇన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగంలోని 10వ షెడ్యూలులో ఎక్కడా పేర్కొనలేదన్న విషయాన్ని ఏజీ న్యాయస్థానానికి విన్నవించే అవకాశం ఉంది.

అయితే.... సుప్రీం దీనిపై ఎలా స్పందిస్తుంద‌న్న‌దాన్ని బ‌ట్టి నిర్ణ‌యం ఉంటుంద‌ని భావిస్తున్నారు. నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ఇంత‌ స‌మ‌యం అంటూ నిబంధ‌న‌ల్లో నిర్దేశించి లేద‌న్న వాద‌న సుప్రీంలో నిల‌బ‌డితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు - స్పీక‌ర్ కూడా సేఫ్ జోన్ లో ఉంటారు. లేదంటే మాత్రం స్పీక‌రు దీనిపై నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అన‌ర్హ‌త త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.