Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ 1 లోపు సమాధానం చెప్పాల్సిందే ..కేంద్రానికి సుప్రీం ఆదేశాలు !

By:  Tupaki Desk   |   26 Aug 2020 3:00 PM GMT
సెప్టెంబర్ 1 లోపు సమాధానం చెప్పాల్సిందే ..కేంద్రానికి  సుప్రీం ఆదేశాలు !
X
రుణాలపై ప్రకటించిన మారటోరియం కాలానికి గాను వసూలు చేస్తున్న అదనపు వడ్డీ రేట్ల పై ఆర్ ‌బీఐ వివరణ ఇవ్వాలని బుధవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై సెప్టెంబర్ 1 లోగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. మారటోరియం కాలంలో చెల్లింపులపై వడ్డీ వసూలు చేయడంపై కొందరు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయితే , సామాన్యులు కరోనా తో ఓ వైపు ఎన్నో సమస్యల్లో ఉంటే ఈ సమయంలో మారటోరియం పై వడ్డీ కట్టమనడం ఎంతవరకు సమంజసం అని కోర్టుకి విన్నపించుకున్నారు.

దీనిపై నేడు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు .. కేంద్రానికి కి కీలక ఆదేశాలు జారీచేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో దేశాన్ని మూసేసింది మీరేనని ..కాబట్టి ప్రజల సమస్యలకి మీరే సమాధానం చెప్పాలి అని ఆదేశించింది. ఆర్బీఐ వెనక దాక్కోకండి .. సెప్టెంబర్ 1 లోపు వడ్డీల మాఫీ పై మీ నిర్ణయం చెప్పండి అంటూ కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. మార‌టోరియం వ‌ల్ల లోన్ల కాల‌ప‌రిమితి పెరుగుతుంద‌ని, కానీ వ‌డ్డీని మాత్రం చెల్లించాలని లేదంటే బ్యాంకులు తీవ్రంగా న‌ష్ట‌పోతాయ‌ని ఆర్‌బీఐ గ‌తంలో తెలిపింది. అయితే దీనిపై సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్ర‌శ్నించింది. మీరు లాక్ డౌన్ విధించారు క‌నుక ఆర్‌బీఐ మార‌టోరియం స‌దుపాయం ఇచ్చింద‌ని.. క‌నుక‌నే ఈ స‌మ‌స్య వ‌చ్చింద‌ని.. కాబ‌ట్టి మార‌టోరియం పొందిన లోన్ల‌పై మార్చి నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు వేసిన వ‌డ్డీని చెల్లించాలా, వ‌ద్దా అనే విష‌యంపై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని, కేంద్రం త‌న వైఖ‌రిని తెల‌పాల‌ని కోర్టు ఆదేశించింది.

రుణ మారటోరియం కేసుపై దాఖలైన పిటిషన్ మీద న్యాయమూర్తులు అశోక్ భూషణ్, షా లతో కూడిన బెంచ్ విచారిస్తూ,మారటోరియం కాలంలో బ్యాంకులు వసూలు చేస్తున్న అదనపు వడ్డీల మీద మీ వైఖరి ఏమిటని , అసలు ఈ సమస్యపై మీరు అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. లోన్ మారటోరియం కేసులో కేంద్రం ఎప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తుందని ప్రశ్నించగా..దానికి వారం రోజుల గడువు కావాలని కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు వడ్డీని మాఫీ చేసిన పక్షంలో బిజినెస్, బ్యాంకులకు దెబ్బ వాటిల్లుతుందన్న కేంద్రం వాదనపై.. ఇప్పుడు ‘బిజినెస్’ గురించి మాట్లాడడానికి ఇది సమయం కాదని జస్టిస్ షా అన్నారు. పిటిషనర్లు తరఫున వాదించిన సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్..మారటోరియం కాల పరిమితి ఈ నెల 31 తో ముగుస్తుందని, సెప్టెంబర్ 1 నుంచి తాము డీఫాల్టర్లమవుతామని అన్నారు. ఈ రుణాలు అప్పుడు నిరర్థక ఆస్తులుగా మారతాయని,అప్పుడు అదో పెద్ద సమస్యగా మారుతుందని , సమస్యలన్నీ పరిష్కారమయ్యేంతవరకు మారటోరియం కాల పరిమితి పొడిగించాలని ఆయన కోరారు. అయితే దానికి తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా , మార్చి 27 న రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన నోటిఫికేషన్ లో కొంత భాగాన్ని రద్దు చేయాలని, దానితో వడ్డీ మాఫీ కావడానికి అవకాశం ఉంటుందని పిటిషనర్లు కోరారు. కాగా,సెప్టెంబర్ 1 న మళ్ళీ ఈ కేసును విచారించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఆ లోపు కేంద్రం ఏంచేస్తుందో చూడాలి.