Begin typing your search above and press return to search.

ప‌దోన్న‌తుల్లో దివ్యాంగుల‌కు రిజ‌ర్వేష‌న్‌.. సుప్రీం కోర్టు ఏమందంటే!

By:  Tupaki Desk   |   29 Jun 2021 8:30 AM GMT
ప‌దోన్న‌తుల్లో దివ్యాంగుల‌కు రిజ‌ర్వేష‌న్‌.. సుప్రీం కోర్టు ఏమందంటే!
X
కొన్ని సంవ‌త్స‌రాలుగా దేశ‌వ్యాప్తంగా వివాదంగా ఉన్న కీల‌క‌మైన విషయం .. ప్ర‌భుత్వ ఉద్యోగులుగా ఉన్న‌ దివ్యాంగుల‌కు ప‌దోన్న‌తుల్లోనూ రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌నే డిమాండ్లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. అయితే.. దీనిని అమ‌లు చేయ‌డం లేద‌ని.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ దివ్యాంగ ఉద్యోగులు అనేక ఉద్య‌మాలు నిర‌స‌న‌లు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో తాజాగా దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు.. దివ్యాంగుల‌కు ప‌దోన్న‌తుల్లోనూ రిజ‌ర్వేష‌న్లు ఉండితీరాల్సిందేన‌ని.. చ‌ట్టం దీనికి అనుమ‌తిచ్చిన విష‌యాన్ని గుర్తు చేసింది. అదేస‌మ‌యంలో కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది.

ఇదే విష‌యంపై గ‌త ఏడాది కేర‌ళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పూర్తిగా స‌మ‌ర్థించింది. దివ్యాంగ మహిళకు పదోన్నతిలో రిజర్వేషన్ అమలు చేయ‌క‌పోవ‌డంపై ఆమె కేర‌ళ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిని విచారించిన కోర్టు.. ఆమెకు ప‌దోన్న‌తిని అమ‌లు చేయాలని పేర్కొంటూ తీర్పు చెప్పింది. అయితే.. దీనిని అమ‌లు చేయ‌క‌పోవ‌డంతోపాటు.. గ‌తంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల‌ను కూడా కేర‌ళ స‌ర్కారు అమ‌లు చేయ‌డం లేద‌ని పేర్కొంటూ.. సుప్రీంలో పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. వీటిని విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డిల ధర్మాసనం దివ్యాంగుల‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

కేర‌ళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల జారీలో ధ‌ర్మాస‌నం అనుసరించిన చర్య సమర్ధనీయమని, ఎటువంటి జోక్యానికి వీలులేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో దివ్యాంగుల కోటాపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కేరళ అమలు చేయడంలేదని వ్యాఖ్యానించింది. పదోన్నతుల్లో దివ్యాంగుల కోటా వర్తిస్తుందని 2016లో రాజీవ్ కుమార్ గుప్తా Vs భారత ప్రభుత్వం కేసు, 2020లో సిద్ధరాజు Vs కర్ణాటక ప్రభుత్వం కేసుల్లో ఇచ్చిన తీర్పులను ప్రస్తావించింది.

‘ఈ తీర్పులను అమలు చేయడానికి కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం.. దివ్యాంగుల కోటా కింద గుర్తించిన పోస్టుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం సముచితమని మేం భావిస్తున్నాము.. ఈ ప్రక్రియ మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయాలి’అని ఆదేశించింది. తప్పనిసరిగా దివ్యాంగుల చట్టం అమలు చేసి తీరాలని స్పష్టం చేసింది. మరోసారి తాము చెప్పేవరకూ పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించింది. పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశాన్ని ఎలా అనుసరించాలో దివ్యాంగుల హక్కుల చట్టం 2016 చెబుతుందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. 1995 చట్టం ప్రకారం రిజర్వేషన్ల ప్రయోజనాలను నీరుగార్చడం శాసనసభ ఉద్దేశం కాదని, ఇందులో ఎటువంటి సందేహం లేదని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. దీంతో దివ్యాంగుల‌కు ప‌దోన్న‌తుల‌లో రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డం రాష్ట్రాల‌కు ప్ర‌ధాన క‌ర్త‌వ్యంగా మారింద‌ని అంటున్నారు న్యాయ నిపుణులు.