Begin typing your search above and press return to search.

ట్రంప్ కు షాకిచ్చిన ఆ దేశ సుప్రీంకోర్టు

By:  Tupaki Desk   |   29 Jan 2017 7:10 AM
ట్రంప్ కు షాకిచ్చిన ఆ దేశ సుప్రీంకోర్టు
X
త‌న‌దైన శైలిలో దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకుంటున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు మొద‌టి ఎదురు దెబ్బ త‌గిలింది. ఏడు ముస్లిం దేశాలకు చెందిన పర్యాటకుల అమెరికా పర్యటనపై నిషేధం విధిస్తూ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యుటివ్ ఆర్డర్ పై అమెరికా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థాన‌మైన‌ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి స్టే విధించారు. వీసా ఉన్నవారు అమెరికాలో పర్యటించవచ్చని ఆయన ఒక అత్యవసర స్టే ఆర్డర్ లో న్యాయ‌మూర్తి పేర్కొన్నారు. వీసా కలిగి ఉండి అమెరికా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వారిని ట్రంప్ ఆర్డర్ కారణంగా వెనక్కు పంపేందుకు వీలులేకుండా స్టే ఇచ్చారు.

ఇదిలాఉండ‌గా..అమెరికా నుంచి ముస్లింలను వెళ్లగొట్టాలని ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యాఖ్యానించిన అగ్రరాజ్య అధిపతి డొనాల్డ్ ట్రంప్.. తన మాటలను ఆచరణలో పెట్టారు. దేశంలోకి ముస్లిం ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకునే పేరిట ఏడు ముస్లిం దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు అమెరికా తలుపులు మూసేశారు. సిరియా నుంచి వచ్చేవారిపై నిరవధిక నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. దీనితోపాటే అమెరికా ఆయుధ విస్తరణకు ఉద్దేశించిన మరో ఆదేశాల‌పైనా ట్రంప్‌ సంతకం చేశారు. ట్రంప్ నిర్ణయాలు అమెరికాలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. ఇవి జాతుల మధ్య ఘర్షణకు సరికొత్త బీజాలు నాటి.. కొత్త ఆయుధ పోటీకి తెర తీశాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ఫర్మానాలను విపక్ష డెమొక్రాట్లే కాకుండా ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్‌వంటి పారిశ్రామికవేత్తలు, నోబెల్ పురస్కార గ్రహీత మలాలా వంటి హక్కుల కార్యకర్తలు వ్యతిరేకించారు. ఇది గోడలు కట్టే సమయం కాదని ఇరాన్ అధ్యక్షుడు రూహానీ హెచ్చరించగా.. అమెరికా చిరకాలంగా అనుసరిస్తున్న శరణార్థుల విధానాన్ని కొనసాగించాలని ఐక్యరాజ్యసమితి హితవు చెప్పింది. ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో ఐరోపా యూనియన్ కూడా కఠినంగానే స్పందించాల్సి ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాండే పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలోనే ఫెడ‌రల్ కోర్టు స్టే విధించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/