Begin typing your search above and press return to search.

ఏపీ ఉన్నత విద్యామండలి విచారణలో సుప్రీం ఏమంది?

By:  Tupaki Desk   |   2 March 2016 5:55 AM GMT
ఏపీ ఉన్నత విద్యామండలి విచారణలో సుప్రీం ఏమంది?
X
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న ఏపీ ఉన్నత విద్యామండలికి సంబంధించిన కేసు విచారణ మంగళవారం చోటు చేసుకుంది. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణ పూర్తి అయి.. తీర్పును రిజర్వ్ చేశారు. మంగళవారం చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినప్పుడు.. తెలంగాణ రాష్ట్ర వైఖరిని ప్రశ్నిస్తూ సుప్రీం న్యాయమూర్తులు పలుసందర్భాల్లో ప్రశ్నలు వేయటం కనిపిస్తుంది. అంతేకాదు.. కాస్తంత ఘాటు వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

మంగళవారం జరిగిన ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు చేసిన కీలక వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వారు చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..

= ఏపీ ఉన్నత విద్యా మండలిని ఏ అధికారంతో.. ఏ చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందో చెప్పండి

​​= ఎవరికి కండబలం ఉంటే చట్టం వారిది అయిపోదు

= తమదే అధికారం అన్నట్లుగా .. భవనాలను స్వాధీనం చేసుకోవాలని.. బ్యాంకు ఖాతాలను జఫ్తు చేయాలని ఆంధప్రదేశ్ సైతం ఉత్తర్వులు ఇవ్వగలదు కదా?

= ప్రాంతీయత ఆధారంగా మండలి తమకే చెందుతుందని.. చట్టంలోని సెక్షన్ 10.. 75లలో ఆ విషయం స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని తెలంగాణ న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చినప్పుడు స్పందించిన న్యాయమూర్తి.. అలా అయితే ఏపీలో మండలి ఉండదు. తెలంగాణ మండలే ఏపీకి కూడా సేవలు అందించాలంటే ఇక ఉమ్మడి మండలిగానే అది కొనసాగాలి. అలాంటప్పుడు ఏపీ ఉన్నత విద్యా మండలి పేరిటే దీనిని కొనసాగించొచ్చు కదా?

= ఈ విషయంపై కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తమ అభిప్రాయాల్ని చెప్పుకోవాలి. అంతేకానీ నేరుగా స్వాధీనం చేసుకోవటాన్ని ఎలా సమర్థిస్తారు?

= ఉమ్మడి సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయని సెక్షన్ 75లో స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని తెలంగాణ న్యాయవాదులు పదే పదే ప్రస్తావించటంపై సుప్రీం జడ్జి అసహనం వ్యక్తం చేస్తూ.. సదరు సెక్షన్ కేవలం సేవల కొనసాగింపు సందర్భంలో మాత్రమే వర్తిస్తుంది. అంతేకానీ ఆస్తులు.. అప్పుల పంపకాలకు కాదు.

= ప్రస్తుతం ఆంధప్రదేశ్.. తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరు ఉన్నత విద్యా మండళ్లు ఉన్న నేపథ్యంలో ఉమ్మడి ఉన్నత విద్యామండలి ఆస్తులు.. అప్పుల్ని రెండింటికి పంపిణీ చేయాలా? వద్దా? అన్నదే మా ముందున్న సమస్య.

= ఉన్నత విద్యా మండలికి ఆస్తులు.. అప్పులు ఉంటే.. ఆస్తులు తెలంగాణకు.. అప్పులు ఆంధ్రప్రదేశ్ కు వెళతాయా? లేక.. తెలంగాణకు ఎక్కువ ఆస్తులు.. ఏపీకి ఎక్కువ అప్పులు వెళతాయా? పంపకాలు హేతుబద్ధంగా జరగాలి కదా. పార్లమెంటు ఉద్దేశం ఏమిటి?

= ఏపీలోని పద్మావతి వర్సటీ ఆస్తులు తెలంగాణకు చెందవు కదా అని హైకోర్టు తీర్పులో పేర్కొన్న ఉదాహరణను తెలంగాణ న్యాయవాదులు పలుమార్లు ప్రస్తావించిన సందర్భంలో అది తప్పు అని జస్టిస్ గౌడ అని అన్నారు.

= పద్మావతి వర్సటీ అనేది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనది. ఉన్నత విద్యా మండలి అధికారం అలాంటి చాలా యూనివర్సిటీలకు వర్తింస్తుంది. అందువల్ల ఏదో ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు. హైకోర్టు తీర్పులో అలా పేర్కొనటం సరికాదు.

= ఒకవేళ విద్యామండలి తెలంగాణకు చెందినదే అయితే.. ఏపీలో మండలి బ్రాంచీలు ఎవరికి ఛెందుతాయి? వాటికి అప్పులు ఉంటే ఎవరికి చెందుతాయి.

= విభజన తర్వాత జనాభా నిష్షత్తిలో ఉన్నత విద్యా మండలి భవనాన్ని పంచుకున్నామని.. కొన్ని అంతస్థుల్లో ఏపీ.. మరికొన్ని అంతస్థుల్లో తెలంగాణ ఉన్నత విద్యా మండళ్లు కొనసాగాయని.. ఆ తర్వాత మొత్తం భవనం తమకే చెందుతుందని తెలంగాణ బయటకు గెంటిందని ఏపీ తరఫు న్యాయవాది వాదన వినిపించగా.. ఇది ఎంతవరకు సమంజసం అని జస్టిస్ అరుణ్ మిశ్రా తెలంగాణను ప్రశ్నించారు.