Begin typing your search above and press return to search.

అమరావతి మీద కేంద్రం ఏమి చెప్పబోతోంది...?

By:  Tupaki Desk   |   31 Jan 2023 10:00 PM GMT
అమరావతి మీద కేంద్రం ఏమి చెప్పబోతోంది...?
X
అమరావతి రాజధాని వివాదం ఇపుడు సుప్రీం కోర్టుకు చేరింది. దాని మీద ఈ రోజు జరగాల్సిన విచారణ జరగలేదు. అయితే ఈ అంశం మీద ఎపుడు విచారణ జరుగుతుంది అన్నదాని మీద ఇంకా స్పష్టత లేదు. అమరావతి రాజధాని కేసు విషయంలో ఇప్పటికే అనేక పిటిషన్లు దాఖలు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ లో అయితే రాజధాని మీద నిర్ణయాధికారం ప్రభుత్వానికి ఉందా లేదా అన్న అంశాన్ని సవాల్ చేస్తూ పేర్కొంది.

ఇక ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు 261 మంది ప్రతివాదులకు నోటీసులు పంపించింది. అందులో కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. అమరావతి రాజధాని ఏపీకి ఏకైక రాజధాని అని ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు జై కొడుతున్నాయి. ఇక ఏపీలో బీజేపీ అమరావతియే మన రాజధాని అని అంటోంది. అదే సమయంలో కేంద్రం తన వైఖరి ఏంటి అన్నది చెప్పాల్సి ఉంది. అది సుప్రీం కోర్టు విచారణలో అతి కీలకం అని అంటున్నారు.

కేంద్ర పెద్దలు మంత్రులు ఇతర నాయకులు అయితే రాజధాని అన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చునని, అది తమ పరిధిలో లేని అంశం అని చాలా సార్లు చెప్పారు. అయితే దాన్ని అవిడవిట్ రూపంలో కేంద్రం కనుక సుప్రీం కోర్టుకు సమర్పిస్తే అపుడు వేరేలా వ్యవహారం ఉంటుంది అని అంటున్నారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయం తీసుకుంటే రాజధాని విషయం సహా పాలనా సంబంధమైన వ్యవహారాలలో తమకు ఉన్న అధికారాలను సవాల్ చేసే విధంగా హై కోర్టు తీర్పు ఉందని భావిస్తోంది. దాంతో దాని మీద సుప్రీం కోర్టు ఏమి చెబుతుంది అన్నది చూస్తోంది. చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీం కోర్టు కనుక తీర్పు చెబితే అపుడు మూడు రాజధానుల బిల్లుని సభలో ప్రవేశపెట్టి చట్టం చేయడానికి వైసీపీ చూసే అవకాశం ఉందని అంటున్నారు.

మరో వైపు చూస్తే కేంద్రం రాష్ట్రానిదే ఇష్టమని చెప్పి ఊరుకున్నా ఈ విషయంలో ఏపీ సర్కార్ కి ఊరట అని అంటున్నారు. ఇదిలా ఉంటే అమరావతి రాజధాని విషయంలో ఇంకా ముసుగులో గుద్దులాట ఎందుకు అని ఏకంగా సీఎం జగన్ విశాఖే మన రాజధాని అని ప్రకటించేశారు అంటున్నారు.

అయితే సీఎం జగన్ ఈ విషయంలో వ్యూహాత్మకమైన వైఖరి తీసుకున్నా సుప్రీం కోర్టు మీదనే అందరి దృష్టి ఉందని అంటున్నారు. సుప్రీం కోర్టు చెప్పిందే ఫైనల్ గా ఉంటుంది కాబట్టి ఏమి నిర్ణయం వెలువడుతుంది అన్నది చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా చలి కాలం ఇంకా కొనసాగుతుండగానే ఏపీలో మూడు రాజధానుల మీద జగన్ మరోసారి మంట పెట్టి రేపారని అంటున్నారు. మరి దీని మీద సుప్రీం కోర్టు తీర్పు పూర్తిగా తెర వేయగలదని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.