తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. నోటీసులు జారీ చేసింది. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడంపై ఈ నోటీసులు జారీ చేసింది. తెలంగాణతోపాటు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశారు.
రెండు రోజుల కింద అసెంబ్లీలో ప్రజారోగ్యంపై సీఎం కేసీఆర్ నిండు సభలో ఆయుష్మాన్ భారత్ పథకంపై నోరుపారేసుకున్నారు. దానికంటే మన ‘ఆరోగ్యశ్రీ’ నయం అంటూ ఉదాహరణలతో కేంద్రం పథకాన్ని ఎండగట్టారు. కేంద్రం పథకం దండగ అని.. పనికిరాదంటూ ఎద్దేవా చేశారు.
అయితే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎన్డీఏ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. తక్కువ ప్రీమియం చెల్లింపుతో వైద్య సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
అయితే తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు కావడం లేదు. ఈ పథకం అమలు చేసే హక్కు రాష్ట్రాలకే ఉందనే కారణంతో తెలంగాణ సర్కార్ అమలు చేయడం లేదు.
కాగా కొందరు సుప్రీం కోర్టు పథకం దేశవ్యాప్తంగా అమలు కావడం లేదని పిటీషన్ వేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం అందక ఆ రాష్ట్రాల ప్రజలు నష్టపోతున్నారని వాదించారు. దీంతో విచారణ అనంతరం ఆయా రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.