Begin typing your search above and press return to search.

టీడీపీ కి షాకుల ప‌రంప‌ర.. సుప్రీంలో మైండ్ బ్లాంక్ తీర్పు

By:  Tupaki Desk   |   12 Dec 2018 9:48 AM GMT
టీడీపీ కి షాకుల ప‌రంప‌ర.. సుప్రీంలో మైండ్ బ్లాంక్ తీర్పు
X
తెలంగాణ ఎన్నిక‌ల్లో ఘోర‌పరాజ‌యం పాలై... దాదాపు గా బిచాణా ఎత్తేసిన ప‌రిస్థితికి చేరిన తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర‌ప్రదేశ్‌లోనూ అదే ప‌రిస్థితి ఎదురైంది!! తెలుగుదేశం పార్టీ కి `ఊహించిన‌` షాక్ త‌గ‌లింది!!. అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు హైకోర్టు ఇచ్చిన షాక్‌కు కొన‌సాగింపుగా.... సుప్రీంకోర్టు సైతం అదే ఉత్తర్వుల‌ను వెల్ల‌డించింది. దీంతో వ‌రుస షాకుల‌ను రుచి చూడ‌టం టీడీపీ వంతు అయింది.

వివ‌రాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని వైసీపీ నేత తిప్పేస్వామి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కర్నాటక లో తన పై నమోదైన క్రిమినల్ కేసులను అఫిడవిట్‌లో వెల్లడించకుండా ఈరన్న దాచారని తిప్పేస్వామి ఆరోపించారు. అంతేకాదు తన భార్య ప్రభుత్వ ఉద్యోగి అనే విషయాన్ని కూడా ఈరన్న అఫిడవిట్‌ లో తెలపలేదని తిప్పేస్వామి తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ పిటిషన్‌ పై పలు దఫాలుగా విచారణ జరిపిన కోర్టు.. అనేక ఆధారాలు సేకరించిన తర్వాత ఈరన్న ఎన్నిక చెల్లదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇది వరకు పోటీలో ఉన్న తిప్పేస్వామి తదుపరి ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని కోర్టు సూచనలు చేసింది.

అయితే, దీని పై అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎమ్మెల్యే ఈరన్న సుప్రీంను ఆశ్రయించారు. హైకోర్టు తీర్పు పై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు సుప్రీంకోర్టులో బుధవారం విచారణకు వచ్చింది. హైకోర్టు తీర్పును పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈరన్న పిటిషన్‌ను కొట్టివేసింది. రెండోస్థానంలో నిలిచిన తిప్పేస్వామే ఎమ్మెల్యేగా కొనసాగుతారని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో టీడీపీ ఖాతాలో ఓ ఎమ్మెల్యే త‌గ్గిపోగా... వైసీపీ ఖాతాలో మ‌రో ఎమ్మెల్యే జోడ‌య్యారు.