Begin typing your search above and press return to search.

మార్గదర్శి చిట్ ఫండ్స్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   18 April 2023 4:00 PM GMT
మార్గదర్శి చిట్ ఫండ్స్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
X
మీడియా మొగల్ గా పేర్కొనే ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావుకు మార్గదర్శి ఇష్యూలో తాజాగా ఎదురుదెబ్బ తగిలినట్లుగా చెబుతున్నారు. మార్గదర్శి అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దశాబ్దాల తరబడి సాగుతున్న ఈ ఉదంతంలో తాజా పరిణామం అత్యంత కీలకమైనదిగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించటం గమనార్హం.

మార్గదర్శికి సంబంధించిన డిపాజిట్ల వివరాల్ని బయటపెట్టాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మార్గదర్శిలో పెట్టుబడి ఎంత? చెల్లింపులు ఎంత? వివరాలు బయటపెట్టటంలో రహస్యం ఎందుకు ఎందుకు? అంటూ ప్రశ్నల్ని సంధించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసుపై జస్టిస్ సూర్య కుమార్.. జస్టిస్ జెబీ పర్డీవాలా ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా మార్గదర్శి వాదనలపై సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. "ఒకవైపు హెచ్ యు ఎఫ్ అని మరోవైపు ప్రొపైటరీ కన్సర్న్ అంటూ చెప్పటాన్ని ప్రశ్నించింది. డిపాజిట్ల వివరాల్ని వెల్లడించాలని కోరింది. డిపాజిటర్ల అందరికి చెల్లింపులు చేసినట్లుగా మార్గదర్శి లాయర్ వెల్లడించారు.

దీనికి స్పందించిన సుప్రీంకోర్టు.. డిపాజిటర్లకు చెల్లింపులు చేసిన తర్వాత.. ఆ వివరాల్ని బయటపెట్టటంలో మీకున్న అభ్యంతరం ఏమిటంటూ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు మాజీ ఎంపీ కమ్ లాయర్ గా వ్యవహరిస్తున్న ఉండవల్లి వినిపించిన వాదనతో ఏకీభవిస్తూ నిర్ణయాన్ని వెలువరించింది.

తాజాగా సుప్రీం చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. సుదీర్ఘకాలంగా ఈ కేసు విషయంపై కోట్లాడుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇదో కీలక మలుపుగా అభివర్ణిస్తున్నారు. ఆయనేమన్నారంటే.. "మార్గదర్శిపై 17 ఏళ్ల న్యాయపోరాటంలో కీలక మలుపు ఇది.

మార్గదర్శిలో డిపాజిట్ల వివరాలు బయట పెట్టాలని సుప్రీం ఆదేశించింది. వాటి వివరాలు బయట పెట్టకుండా ఎందుకు దాస్తున్నారు? రూ.2,600 కోట్ల డిపాజిట్లు ఎక్కడ నుంచి వచ్చాయి?డిపాజిట్లను ఎంత మందికి తిరిగి చెల్లించారు? చెక్కుల రూపంలో ఇచ్చారా..? మరో రూపంలో ఇచ్చారా? డిపాజిటర్ల వివరాలను కోర్టుకు అందజేయాలి. యాజమాన్య తీరును వివరించాలి అని సుప్రీం పేర్కొంది" అంటూ ఉండవల్లి పేర్కొన్నారు. తాజా పరిణామాలపై మార్గదర్శి ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.