Begin typing your search above and press return to search.

రాజధానిపై జగన్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఊరట!

By:  Tupaki Desk   |   28 Nov 2022 9:08 AM GMT
రాజధానిపై జగన్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఊరట!
X
అమరావతి రాజధాని వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లిన జగన్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. గతంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆరు నెలల్లో రాజధానిని నిర్మించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తాజాగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆరు నెలల కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఏమైనా టౌన్‌ ప్లానరా? అని ప్రశ్నించింది. ఆరు నెలల్లో నిర్మాణం చేయాలని మీరు (హైకోర్టు) ఎలా చెబుతారు?.. మీరే ప్రభుత్వమైతే అక్కడ ప్రభుత్వం ఎందుకు? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కదా? అని సుప్రీంకోర్టు నిలదీసింది. హైకోర్టు ఆరు నెలల్లో రాజధానిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించింది అని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా? అని నిలదీసింది. రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేమని కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేం అని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది.

అయితే రాజధానిని ఆరు నెలల్లో పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపైనే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రాజధానిపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదనే హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోవడం గమనార్హం. దీనిపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

కాగా ఏపీ ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్, అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్, నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాజధాని ప్రాంత రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యాందివాన్‌ వాదించారు. న్యాయమూర్తులు జస్టిస్‌ కేవీ జోసెఫ్, బీవీ నాగరత్నంల ధర్మాసనం ఈ కేసును విచారించింది.

హైకోర్టు స్టే ఇచ్చిన ఏడు అంశాలపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోరగా సుప్రీంకోర్టు కేవలం రాజధానిని ఆరు నెలల్లో పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపైన మాత్రమే స్టే ఇచ్చింది. మిగతా అంశాలపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.