Begin typing your search above and press return to search.

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య కేసులో.. త‌మిళ‌నాడు స‌ర్కారుకు షాక్‌

By:  Tupaki Desk   |   14 Feb 2022 1:51 PM GMT
విద్యార్థిని ఆత్మ‌హ‌త్య కేసులో.. త‌మిళ‌నాడు స‌ర్కారుకు షాక్‌
X
త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టులో షాక్ త‌గిలింది. ఒక విద్యార్థిని ఆత్మ‌హ‌త్య కేసుకు సంబంధించి.. రాష్ట్ర పోలీసుల‌తోనే ద‌ర్యాప్తు చేయిస్తామ‌ని.. పేర్కొన్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఎందుకంత‌.. ప్రెస్టేజ్‌గా ఫీల‌వుతున్నారు? ఇన్నాళ్లు మీరు ఏం చేశారంటూ.. సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. అంతేకాదు..

ఈ కేసులో మ‌ద్రాస్ హైకోర్టుకు సంబంధించిన మ‌ధురై బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు స‌మ‌ర్ధించింది. స‌ద‌రు విద్యార్థిని ఆత్మ‌హ‌త్య కేసును సీబీఐకి అప్ప‌గిస్తూ.. నిర్ణ‌యించింది. దీంతోరాష్ట్ర ప్ర‌భుత్వ వాద‌న‌ను సుప్రీం కోర్టు ప‌క్క‌న పెట్టేసిన‌ట్టు అయింది.

విష‌యం ఇదీ..
త‌మిళ‌నాడులోని అరియ‌లూరు జిల్లాకు చెందిన మురుగానందం.. త‌న భార్య మృతి చెంద‌డంతో శ‌ర‌ణ్య అనే మ‌హిళ‌ను రెండో వివాహం చేసుకున్నారు. ఇదిలావుంటే.. ఆయ‌న మొద‌టి భార్య‌కు పుట్టిన కుమార్తె లావ‌ణ్య తంజావూరు జిల్లాలోని మైఖేల్ ప‌ట్టి ప్రైవేటు పాఠ‌శాల‌లో ప్ల‌స్ టూ చ‌దువుతోంది. అయితే.. ప‌క్క జిల్లా అయిన‌ప్ప‌టికీ.. తండ్రి రెండో వివాహం చేసుకోవ‌డంతో.. లావ‌ణ్య‌.. పాఠ‌శాల హాస్ట‌ల్‌లోనే ఉంటూ.. విద్య‌ను కొన‌సాగింది. ఈ నేప‌థ్యంలోగ‌త నెల‌లో లావ‌ణ్య విషం తాగి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై.. ఆసుప‌త్రిలో క‌న్ను మూసింది.

లావ‌ణ్య‌ను హాస్ట‌ల్ వార్డెన్ స‌హాయ‌మేరి.. పాఠ‌శాల నిర్వాహ‌కులు రోజూ పారిశుద్ధ్య ప‌నులు చేయించేవార‌ని.. అదే స‌మ‌యంలో మ‌తం మారాలంటూ.. వేధించార‌ని.. ఈ కార‌ణాల‌తోనే ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనికి సంబంధించి లావ‌ణ్య సెల్పీ వీడియో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది.

ఇదిలావుంటే.. పోలీసులు రంగంలోకి దిగి.. విచార‌ణ చేప‌ట్టారు. అదేస‌మ‌యంలో లావ‌ణ్య ఆసుప‌త్రిలో చావుబ‌తుకుల మ‌ధ్య ఉన్న‌ప్పుడు.. మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చింది. ఈ రెండు చోట్లా కూడా.. ఆమె త‌న‌ను మ‌త మార్పిడికి ఒత్తిడి చేశారంటూ.. స్కూలు నిర్వాహ‌కుల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌లేదు. కానీ, సెల్ఫీ వీడియోలో మాత్రం అలా పేర్కొంది.

అయితే.. లావ‌ణ్య తండ్రి.. మాత్రం సెల్ఫీ వీడియో ఆధారంగా.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ స్వామినాథ‌న్‌.. రెండు భిన్న‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నాయ‌ని.. పేర్కొంటూ.. కేసును సీబీఐకి అప్ప‌గిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

మ‌త‌మార్పిడుల ఒత్తిళ్లు నిజ‌మో కాదో తెలియాలంటే.. సీబీఐ విచార‌ణ త‌ప్ప‌ద‌ని తెలిపారు. అయితే.. హైకోర్టు ఆదేశాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. సీబీఐకి అవ‌స‌రం లేద‌ని.. తాము విచారిస్తామ‌ని పేర్కొంటూ.. డీజీపీ సుప్రీంలో పిటిష‌న్ వేశారు.

విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మధురై బెంచ్ తీర్పును సమర్థిస్తూ తమిళనాడు డీజీపీకి, ప్రభుత్వానికి నోటీసులు పంపింది. అంతేకాదు ఇదేం ప్రెస్టీజ్ ఇష్యూ( సీబీఐకు అప్పగించడం ద్వారా రాష్ట్ర పోలీసుల ప్రతిష్టకు భంగం కలిగించే విషయం) కాదంటూ స్టాలిన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది.

అంతేకాదు దర్యాప్తు కూడా హైకోర్టు ఆదేశాల ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, బెల ఎం త్రివేది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.