Begin typing your search above and press return to search.

ఎన్ కౌంటర్ పై సుప్రీం కీలక నిర్ణయం .. రిటైర్ జడ్జ్ తో !

By:  Tupaki Desk   |   12 Dec 2019 7:25 AM GMT
ఎన్ కౌంటర్ పై సుప్రీం కీలక నిర్ణయం .. రిటైర్ జడ్జ్ తో  !
X
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన పై సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. ఇందుకోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూర్‌కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌లో వీఎన్ రేఖ, సీబీఐ మాజీ అధికారి కార్తికేయన్ సభ్యులుగా నియమించింది. ఆరు నెలల్లో దీనిపై విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఈ కమిషన్‌ కు స్పష్టం చేసింది. వీరికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ కమిషన్ చేపట్టబోయే విచారణ వివరాలను మీడియాకు లీక్ కాకుండా చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన జరుగుతున్న అన్ని రకాల దర్యాప్తులను ఆపాలని, ఈ కమిషన్ దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతుందని ఆదేశించింది. అంతకుముందు ఈ కేసు కు సంబంధించి సుప్రీంకోర్టు లో పూర్తిస్థాయి లో వాదనలు జరిగాయి. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

నిందితులు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కున్నారని ఆయన కోర్టుకు వివరించారు. పోలీసులపై కాల్పులు జరిపారని.. రాళ్లు రువ్వారని తెలిపారు. నిందితులు తాము లాక్కున్న రివాల్వర్స్‌ తోనే పోలీసుల పై కాల్పులు జరిపారా అని ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ బోబ్డే ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇచ్చిన ముకుల్ రోహత్గీ... వాళ్లు కాల్చారు కానీ బుల్లెట్ల నుంచి పోలీసులు తప్పించుకున్నారని వివరించారు. ఎన్‌కౌంటర్ పై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సిట్‌ ను ఏర్పాటు చేసిందని కోర్టుకు తెలిపారు. గన్స్ లాక్కోవడం పై FIR నమోదైందని అన్నారు. అయితే చనిపోయిన నిందితులకు వ్యతిరేకంగా FIR ఉందని పిటిషనర్ జీఎస్ మణి తెలిపారు.