Begin typing your search above and press return to search.

రాజీకి బ‌య‌టోళ్ల అవ‌స‌రం లేద‌ని చెప్పేశారు

By:  Tupaki Desk   |   14 Jan 2018 6:19 AM GMT
రాజీకి బ‌య‌టోళ్ల అవ‌స‌రం లేద‌ని చెప్పేశారు
X
దేశ వ్యాప్తంగా పెను సంచ‌ల‌నంగా మారిన సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల వివాదం ఇప్పుడిప్పుడే స‌ర్దుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ప‌రిణామాలు ఆచితూచి అన్న‌ట్లుగా సాగుతున్నాయి. తెర వెనుక భారీ ఎత్తున ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నా.. వాటి వివ‌రాలు బ‌య‌ట‌కు పొక్క‌టం లేదు. అదే స‌మ‌యంలో.. ప్రెస్ మీట్ పెట్టి సంచ‌ల‌నం సృష్టించిన సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు.. శ‌నివారం ఎవ‌రికి వారు వారి వారి కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ప్రెస్ మీట్ పెట్టిన న‌లుగురు సుప్రీం న్యాయ‌మూర్తుల్లో ఒక‌రైన జ‌స్టిస్ జోసెఫ్ కురియ‌న్ శ‌నివారం కేర‌ళ‌లోని కోచి స‌మీపంలోని క‌క్క‌నాడ్ ను సంద‌ర్శించారు. అక్క‌డ జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.ఈ సంద‌ర్భంగా మీడియా వేసిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు.

స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైన‌ద‌ని.. దాన్ని సంబంధిత వ్య‌క్తులు విన్నార‌ని.. ఫ్యూచ‌ర్ లో ఇలాంటివి చోటు చేసుకోవ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. స‌మ‌స్య‌కు బ‌య‌ట‌వారి అవ‌స‌రం ఉందా? అన్న ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. బ‌య‌ట‌వారి జోక్యం అవ‌స‌రం లేద‌ని.. ఇది ఒక సంస్థ‌లో త‌లెత్తిన స‌మ‌స్య అని.. దాన్ని ప‌రిష్క‌రించుకోవ‌టానికి సంస్థే త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లుగా చెప్పారు.

సుప్రీంకోర్టు వ్య‌వ‌హారాలు రాష్ట్రప‌తికి రాజ్యాంగ‌ప‌ర‌మైన బాధ్య‌త‌లు లేవ‌ని.. అందుకే ఆయ‌న దృష్టికి తీసుకెళ్ల‌లేద‌న్నారు. అదే స‌మ‌యంలో తాము ఆరోప‌ణ‌లు చేసిన సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌న్నారు. కాకుంటే త‌న విధినిర్వ‌హ‌ణ‌లో పాటించాల్సిన సంప్ర‌దాయాలు.. ఆచారాలు.. విధానాల్ని అనుస‌రించ‌క‌పోవ‌టమే త‌మ అభ్యంత‌రంగా కురియాన్ వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.

ప్రెస్ మీట్ పెట్ట‌టం ద్వారా ఎలాంటి క్ర‌మ‌శిక్ష‌ణ‌నూ ఉల్లంఘించ‌లేద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. త‌మ చ‌ర్య‌ల కార‌ణంగా సుప్రీంకోర్టు పాల‌నా వ్య‌వ‌స్థ‌లో పార‌ద‌ర్శ‌క‌త నెల‌కొంటుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. న్యాయం.. న్యాయ‌వ్య‌వ‌స్థ కోసం తాము నిల‌బ‌డ్డామ‌ని.. ఢిల్లీలో తాము చెప్పింది కూడా ఇదేన‌ని.. ఇంత‌కుమించి మ‌రింకేమీ లేద‌న్నారు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కాన్ని పెంచ‌ట‌మే త‌మ లక్ష్యమ‌న్నారు. ఇక‌.. ప్రెస్ మీట్ లో పాల్గొన్న మ‌రో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్ శ‌నివారం కోల్ క‌తాకు వెళ్లారు. త‌నను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడిన ఆయ‌న‌.. సుప్రీంకోర్టులో సంక్షోభం ఏమీ లేద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.