Begin typing your search above and press return to search.

ఆర్నాబ్ కు తాత్కాలిక బెయిల్.. వామ్మో ఇంత విజయానందమా?

By:  Tupaki Desk   |   12 Nov 2020 4:15 AM GMT
ఆర్నాబ్ కు తాత్కాలిక బెయిల్.. వామ్మో ఇంత విజయానందమా?
X
అతడో సెలబ్రిటీ జర్నలిస్టు. తన చానల్ లో తాను నిర్వహించే డిబేట్ లో విరుచుకుపడుతుంటారు. దేశం తెలుసుకోవాలనుకుంటుందంటూ తన మాటలతో ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. తన అడ్డాలో.. తన టేబుల్ వద్దకు వచ్చిన వారు ఎవరైనా.. ఏ రంగానికి చెందిన వారైనా సరే.. ఒకలాంటి ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయి.. ఇంత టాలెంటా? అంటూ ముక్కున వేలేసుకునేలా చేయటం.. నోటమాట రానివ్వకుండా వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయటం.. ఆ క్రమంలోనే తానేం అనుకుంటున్నాడో అదే విషయాన్ని తీర్పులా చెప్పేసే టాలెంట్ రిపబ్లిక్ టీవీ చానల్ చీఫ్ అర్నాబ్ గో స్వామి సొంతం.

ఆయన దూకుడుతనాన్ని ఇష్టపడే వారు చాలామంది ఉంటే.. ఆయన తీరు సరికాదని వేలెత్తి చూపేటోళ్లు కొందరుంటారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. సెలబ్రిటీ జర్నలిస్టుల్లో ఆయన ఒకరుగా చెబుతారు. ఇదిలాఉంటే.. ఇటీవల కాలంలో మహారాష్ట్ర సర్కారు వర్సెస్ ఆర్నాబ్ అన్నట్లుగా కొన్ని పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. తన మాటలతో.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ఎప్పుడు ఎదురుకాని అనుభవాన్ని బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఎపిసోడ్ లో పరిచయం చేశారు.

దీనికి పర్యవసానంగా గతంలో ఒక ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య చేసుకోవటం.. దానికి కారణం ఆర్నాబ్ అంటూ లేఖ్ రాసి చనిపోయిన కేసు తిరిగి ఓపెన్ అయ్యేలా చేయటంతో మహా ముఖ్యమంత్రి కీలక భూమిక పోషించారని చెబుతారు. రాజు తలుచుకుంటే దెబ్బలకుకొదవా అన్నట్లుగా.. ఢిల్లీ పెద్దల అండ టన్నుల లెక్కన ఉన్న ఆర్నాబ్ ఇంటికి పోలీసులు రావటం.. బలవంతంగా అరెస్టు చేసి తమ వెంట తీసుకెళ్లటమేకాదు..ఆయనపై మోపిన నేరారోపణకు బెయిల్ రాని పరిస్థితి. క్వారంటైన్ సెంటర్లో ఉండాల్సిన అతని వద్ద నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ ఫోన్ వాడుతున్నారంటూతలోజా జైలుకు తరలించిన వైనం సంచలనంగా మారింది.

ఇలాంటివేళ.. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన ఆర్నాబ్ పిటిషన్ వాయు వేగంతో కదిలి.. సుప్రీం ద్విసభ్య ధర్మాసనం వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆర్నాబ్ తో పాటు మరో ఇద్దరు నిందితులకు మధ్యంతర బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత పూచీకత్తు కింద రూ.50వేల చొప్పున బాండ్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

నిందితుల విడుదలలో ఆలస్యం జరగకూడదని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో.. యుద్ధ ప్రాతిపదికన కదిలిన ఫైల్ కారణంగా.. బుధవారం రాత్రి కాస్త ఆలస్యంగా జైలు నుంచి విడుదలయ్యారు. ముంబయిలోని తలోజా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన అర్నాబ్.. భారీ ర్యాలీని నిర్వహించారు. అనూహ్యంగా అతడికి స్వాగతం పలకటానికి పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకు రావటం ఆసక్తికరంగా మారింది.

తననుచూసేందుకు వచ్చిన భారీ జనసందోహాన్ని చూసిన అర్నాబ్.. కారులో నుంచి బయటకు వచ్చి మరీ.. ఉద్వేగంతోనినాదాలు చేశారు. జనసందోహాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు తెగ కష్టపడాల్సి వచ్చింది. అరెస్టు చేయటానికి ఆర్నాబ్ ఇంటికి 70 మంది పోలీసులు వెళితే.. మధ్యంతర బెయిల్ వచ్చిన ఆయన్ను ఇంటికి వెళ్లేందుకు 700 మందికి పైగా పోలీసు బందో బస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న మాట వినిపిస్తోంది. మధ్యంతర బెయిల్ తో విడుదలైన అర్నాబ్.. భావోద్వేగంతో కదిలిపోయిన వైనం చూసినోళ్లు మాత్రం.. ఎంత బెయిల్ అయితే మాత్రం మరీ అంత విజయానందమా? అన్న భావన కలిగేలా చేసిందని చెప్పక తప్పదు.