Begin typing your search above and press return to search.

కేసీఆర్ స‌ర్కారుకు సుప్రీం మొట్టికాయ‌

By:  Tupaki Desk   |   12 Sep 2017 5:01 AM GMT
కేసీఆర్ స‌ర్కారుకు సుప్రీం మొట్టికాయ‌
X
తెలంగాణ స‌ర్కారుకు అత్యున్న‌త న్యాయ‌స్థానం మొట్టికాయ వేసింది. కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఆయ‌న స‌ర్కారు తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌పై ఇప్ప‌టికే కోర్టుల్లో ఎదురుదెబ్బ‌లు త‌గిలిన ఉదంతాలు తెలిసిందే. తాజాగా కేసీఆర్ స‌ర్కారు వాద‌న మీద అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సుప్రీంకోర్టు.. టీచ‌ర్ల నియామ‌క ప్ర‌క్రియను పూర్తి చేసేందుకు మ‌రోసారి గ‌డువు కోర‌టంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేసింది.

పాత క‌థ‌లు ఇంకెన్నిసార్లు చెబుతారండీ అంటూ ఫైర్ అయిన సుప్రీం.. కేసు విచార‌ణ‌కు విద్యాశాఖ కార్య‌ద‌ర్శిని హాజ‌రు కావాల్సిందిగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మౌలిక‌వ‌స‌తుల లేమి.. సిబ్బంది కొర‌త త‌దిత‌ర అంశాల‌పై కోర్టు ధిక్కార పిటీష‌న్ దాఖ‌లైంది. దీనిపై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం విచారిస్తోంది. తాజాగా జ‌రిగిన విచార‌ణ సంద‌ర్భంగా టీచ‌ర్ల నియామ‌కం కోసం మ‌రో రెండు నెల‌లు స‌మ‌యం కావాల‌ని కోరింది. మార్చి 24న ఈ కేసు విచార‌ణ సమ‌యంలో మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో టీచ‌ర్ల పోస్టులు భ‌ర్తీ చేయాల‌ని.. ఇది త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిన క‌ర్త‌వ్యంగా సుప్రీం నిర్దేశించింది.

సుప్రీంనిర్ణ‌యం ఇంకా అమ‌లు కాక‌పోవ‌ట‌మే కాదు.. మ‌రింత గ‌డువు కోర‌టంపై సుప్రీం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. జిల్లాల విభ‌జ‌న నేప‌థ్యంలో సుప్రీం ఆదేశాన్ని అమ‌లు చేయ‌టంలో జాప్యం జ‌రిగిన‌ట్లుగా గ‌తంలో చెప్పిన కేసీఆర్ స‌ర్కారు తీరును త‌ప్పుప‌ట్టింది. ఇప్ప‌టికే ప‌లుమార్లు గ‌డువు ఇచ్చార‌ని.. తుది గ‌డువు ఇస్తూ మాండ‌మ‌స్ జారీ చేసిన త‌ర్వాత కూడా మ‌రోసారి గ‌డువు ఇవ్వ‌టం స‌రికాద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన పిటీష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌ను వినిపించారు. ప్ర‌భుత్వ అప్పీలును.. పిటీష‌న‌ర్ వాద‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న సుప్రీం ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను అక్టోబ‌రు 23కు వాయిదా వేసింది. వ‌డివడిగా నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని.. అమ‌లు శ‌ర‌వేగంగా ఉంటుంద‌ని చెప్పుకునే గులాబీ బాస్‌.. సుప్రీం తాజా వ్యాఖ్య‌ల‌కు ఎలాంటి స‌మాధానం ఇస్తారో?