Begin typing your search above and press return to search.

మా మాట లెక్క‌లేదా.. ఇలా అయితే, క‌ష్ట‌మే: కేంద్రంపై సుప్రీం ఫైర్‌

By:  Tupaki Desk   |   28 Nov 2022 4:30 PM GMT
మా మాట లెక్క‌లేదా.. ఇలా అయితే, క‌ష్ట‌మే:  కేంద్రంపై సుప్రీం ఫైర్‌
X
``మా మాట లెక్క లేదా? మేం చెప్పాక కూడా తాత్సార‌మా? ఇలా అయితే క‌ష్ట‌మే!`` అంటూ కేంద్ర ప్ర‌భుత్వంపై సుప్రీం కోర్టు తీవ్ర‌స్తాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కొలీజియం సిఫారసులపై కేంద్రం అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జడ్జీల నియామక ప్రక్రియకు గడువు విధించి.. ఆలోపే పుర్తి చేయాలని సూచించింది. జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓఖాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ) చట్టం విషయంలో కేంద్రం అసంతృప్తితో ఉందని అర్థమవుతోందని వ్యాఖ్యానించింది.

అయితే.. కొలీజియం సిఫార్సులు ఆమోదించడంలో జాప్యానికి ఇది కారణం కారాదని అభిప్రాయపడింది. కొలీజియం సిఫార్సులను జాప్యం చేస్తున్నారంటూ బెంగళూరు బార్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

న్యాయవ్యవస్థ స్వతంత్రతను కేంద్రం దెబ్బ తీస్తోందని ఆ వ్యాజ్యంలో పిటిషనర్లు ఆరోపించారు. జడ్జీల నియామకానికి సిఫార్సు చేసేముందు కొలీజియం అనేక విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు వివరించింది.

కొలీజియం అనేక సార్లు సిఫార్సు చేసినా జడ్జీల నియామకం జరగలేదని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణికి గుర్తు చేసింది. గత రెండు నెలలుగా కొలీజియం సిఫార్సులు యధాతథంగానే ఉన్నాయని.. వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించింది. న్యాయవ్యవస్థే చర్యలు తీసుకునేలా చేయొద్దని హెచ్చరించింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసిన కోర్టు.. అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ఇద్దరూ హాజరు కావాలని ఆదేశించింది.

2014లో కేంద్ర ప్ర‌భుత్వం నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ) చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే దీనిని 2015లో సుప్రీంకోర్టు కొట్టివేయడం వల్ల కొలీజియం వ్యవస్థ తిరిగి అమల్లోకి వచ్చింది. నాలుగు వారాల్లోపే కొలీజియం సిఫార్సులను ఆమోదించాలని గతేడాది ఏప్రిల్లో కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అయిన‌ప్ప‌టికీ.. కేంద్ర న్యాయ‌శాఖ ఈ సిఫార‌సుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో సుప్రీం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.