Begin typing your search above and press return to search.

హైకోర్టు విభ‌జ‌న‌పై పిటిష‌న్‌..ఆపేందుకు సుప్రీం నో

By:  Tupaki Desk   |   2 Jan 2019 5:43 PM IST
హైకోర్టు విభ‌జ‌న‌పై పిటిష‌న్‌..ఆపేందుకు సుప్రీం నో
X
ఉమ్మడి హైకోర్టు విభజనలో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ విభ‌జ‌న‌పై దాఖలైన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. చిన్న చిన్న సమస్యలు సర్వసాధార‌ణమేనని...ఈ విషయంలో జోక్యం చేసుకోవడం జరగదని తెలిపింది. జనవరి 1వ తేదీ నుండే ఇరు రాష్ట్రాల హైకోర్టులో పనిచేయడం ప్రారంభించాయి. ఇప్పటికే రెండు హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే...అమరావతిలో కడుతున్న హైకోర్టు అసమగ్రంగానే ఉందని..సరైన మౌలిక వసతులు లేవని..అప్పటి వరకు విభజన వాయిదా వేయాలంటూ ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయ‌గా ఈ తీర్పు వెలువరించింది.

ఏపీ న్యాయ‌వాదుల సంఘం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ పై జనవరి 2వ తేదీ సుప్రీం విచారణ చేపట్టింది. చాలా సంవత్సరాలుగా పెండింగ్‌ లో ఉన్న అంశమని..చాలా దఫాలుగా విచారించడం జరిగిందని పేర్కొంది. పిటిషనర్ల వాదనలతో జస్టిస్ ఎ.కె.సిక్రీ - అబ్దుల్ నజీర్‌‌ లతో కూడిన ధర్మాసనం ఏకీభవించకుండా కార్య‌క‌లాపాలు కొన‌సాగించాల‌ని ఆదేశించింది. ఇదిలాఉండ‌గా - హైకోర్టు అమరావతిలో ఏర్పాటు కావడం పట్ల ఆంధ్రలో ప్రాక్టిస్ చేస్తున్న వారు సంతోషం వ్యక్తం చేస్తూ...దీనిని అడ్డుకోవడం సరికాదంటూ లెటర్ చీఫ్ జస్టిస్‌ కు లేఖ రాశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా హైకోర్టులు కార్యకలాపాలు సాగించబోతున్నాయి.