Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌కంపై సుప్రీం ఏం చెప్పిందంటే?

By:  Tupaki Desk   |   12 July 2019 9:48 AM
క‌ర్ణాట‌కంపై సుప్రీం ఏం చెప్పిందంటే?
X
థ్రిల్ల‌ర్ ను త‌ల‌పించే పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గ‌డిచిన వారంగా క‌ర్ణాట‌క కేంద్రంగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దేశంలో రాజ‌కీయం ఎంత దారుణ పరిస్థితుల్లోకి దిగ‌జారిపోతుంద‌న్న సంకేతాల్ని ఇచ్చేలా తాజా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయ‌ని చెప్పాలి. ప‌ద‌వుల మీద అసంతృప్తితో పాటు.. క‌మ‌ల‌నాథుల అభ‌య‌హ‌స్తంతో త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై క‌ర్ణాట‌క అసెంబ్లీ స్పీక‌ర్ అన‌ర్హ‌త వేటు వేసే దిశ‌గా పావులు క‌ద‌ప‌టం తెలిసిందే. దీంతో.. రెబ‌ల్ ఎమ్మెల్యేలపై స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది ఉత్కంఠ‌గా మారింది.

ఇదిలా ఉంటే.. దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంలో ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిగింది. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్నంత‌నే సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పును వెల్ల‌డించింది. రెబెల్ ఎమ్మెల్యేల‌పై ఎలాంటి చ‌ర్య తీసుకోకూడ‌ద‌ని.. ఇప్పుడున్న ప‌రిస్థితిని య‌థాత‌ధంగా అమ‌లు చేయాల‌ని పేర్కొన్నారు. ఈ కేసుపై త‌దుప‌రి విచార‌ణ‌ను జులై 15కు వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

రెబెల్ ఎమ్మెల్యేల త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ త‌న వాద‌న‌ల్ని వినిపించారు. ఎమ్మెల్యేలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసినా స్పీక‌ర్ ఆమోదించ‌టం లేద‌ని.. ఈ అంశాన్ని పెండింగ్ ఉంచుతూ.. వారిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని భావిస్తున్నార‌ని.. ఇది స‌రైన‌ది కాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. రాజీనామాల‌ను కావాల‌నే స్పీక‌ర్ ఆమోదించ‌టం లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. స్పీక‌ర్ రెండు గుర్రాల మీద స్వారీ చేస్తున్నార‌ని.. వెంట‌నే రాజీనామాల్ని ఆమోదించాల‌ని కోరారు.

రాజీనామాలు ఆమోదించ‌కుండా స్పీక‌ర్ కు అవ‌కాశం ఇస్తే అన‌ర్హ‌త వేటు వేసే అవ‌కాశం ఉంద‌న్న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన త‌ర్వాత కూడా వాటిని ఆమోదించ‌ని తీరుపై స్పీక‌ర్ కు కోర్టు ధిక్కార‌ణ నోటీసులు ఇవ్వాల‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. స్పీక‌ర్ ర‌మేశ్ కుమార్ త‌ర‌ఫున ప్ర‌ఖ్యాత న్యాయ‌వాది క‌మ్ కాంగ్రెస్ నేత అభిషేక్ మ‌ను సింఘ్వీ త‌న వాద‌న‌లు వినిపించారు. దీనికి ముందు సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు ఆయ‌న్ను కొన్నిప్ర‌శ్న‌ల్ని సంధించారు. కోర్టు ఉత్త‌ర్వుల్ని స‌వాల్ చేసే అధికారం స్పీక‌ర్ కు ఉందా? అని ప్ర‌శ్నించారు. దీనికి సింఘ్వీ బ‌దులిస్తూ.. అలాంటిదేమీ లేద‌న్నారు. అయితే.. ఫ‌లానా స‌మ‌యానికే స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకోవ‌టం స‌రికాద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

ఎమ్మెల్యేల రాజీనామా వెనుక ఉద్దేశం వేర‌ని.. అన‌ర్హ‌త వేటు నుంచి త‌ప్పించుకోవ‌టానికి వారు ప‌ద‌వుల నుంచి త‌ప్పుకుంటున్నార‌ని పేర్కొన్నారు. అందుకే.. రాజీనామాల్ని ఆమోదించేకంటే ముందు అన‌ర్హ‌త వేటు వేసే అంశాన్ని ప‌రిశీలించాల‌న్నారు. ఈ వ్య‌వ‌హారంలో సుదీర్ఘంగా సాగిన వాద ప్ర‌తివాద‌న‌ల అనంత‌రం సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఉత్త‌ర్వుల్నిజారీ చేసింది. రెబెల్ ఎమ్మెల్యేల‌పై ఇప్పుడు ఎలాంటి స్టేట‌స్ ఉందో దాన్ని అలానే కొన‌సాగించాల‌ని.. త‌మ త‌దుప‌రి విచార‌ణ‌లో ఏం చేయాలో చెబుతామ‌న్నారు. ఈ కేసు రాజ్యాంగంలోని 190 - 361 అధిక‌ర‌ణ‌ల‌తో ముడిప‌డి ఉంద‌న్నారు. ఎమ్మెల్యేల రాజీనామాల్ని ఆమోదించే ముందు వారి అన‌ర్హ‌త‌పై స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకోవ‌చ్చా? అన్న‌ది నిర్ణ‌యించాల్సి ఉంద‌ని పేర్కొంది. ఈ కేసును విచారిస్తున్న‌ సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నంలో చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్.. జ‌స్టిస్ దీప‌క్ గుప్తా.. జ‌స్టిస్ అనిరుద్ద బోస్ లు ఉన్నారు. ఈ వ్య‌వ‌హారంపై మంగ‌ళ‌వారం నాటికి ఒక కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఉంది.