Begin typing your search above and press return to search.

మహా ట్విస్టు పై సండేనాడు సుప్రీం కీలక ఆదేశాలు

By:  Tupaki Desk   |   24 Nov 2019 9:48 AM GMT
మహా ట్విస్టు పై సండేనాడు సుప్రీం కీలక ఆదేశాలు
X
దేశ అత్యుత్తమ న్యాయస్థానమైన సుప్రీంకోర్టు స్పందించింది. సెలవు రోజైన సండేనాడు మహారాష్ట్రలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై రియాక్ట్ అయ్యింది. అనూహ్యంగా శనివారం ఉదయం కొలువు తీరిన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం అసెంబ్లీలో వెనువెంటనే బలపరీక్ష ఎదుర్కోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. బలపరీక్ష ఎప్పుడు నిర్వహించాలో తాము చెబుతామని పేర్కొంది.

అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజార్టీ ఉందంటూ గవర్నర్ కు బీజేపీ సమర్పించిన లేఖల్ని సోమవారం తమకు సమర్పించాల్సిందిగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ పంపిన లేఖను తమకు అందజేయాలని సొలిసిటర్ జనరల్ ను కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్రానికి.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో పాటు.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ లకు నోటీసులు జారీ చేసింది.
విపక్షాలు డిమాండ్ చేసినట్లు వెనువెంటనే బలపరీక్షను నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన కేసు విచారణకు సోమవారం ఉదయం 10.30లకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ రమణ.. అశోక్ భూషణ్.. సంజీవ్ కన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సెలవురోజున విచారణను చేపట్టింది. ఇక.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన తరఫు కాంగ్రెస్ సీనియర్ నేత కమ్ ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించగా.. బీజేపీ తరఫు ముకుల్ రోహత్గే వాదనలు వినిపించారు.

మెజార్టీ లేని ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని.. రాజ్యాంగ విరుద్ధమని.. చట్టవిరుద్ధంగా ప్రకటించాలని శివసేన తరఫు న్యాయవాది వాదించారు. బేరసారాలు.. చట్టవ్యతిరేక చర్యలు నివారించేందుకు వీలుగా 24 గంటల్లో విశ్వాస పరీక్ష జరిగేలా ఆదేశించాలన్నారు. కానీ.. కోర్టు అందుకు అంగీకరించలేదు. విశ్వాస పరీక్ష ఎప్పుడు నిర్వహించాలో తాము చెబుతామని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోర్టుకు సమర్పించే లేఖల అంశం ఇప్పుడు ఉత్కంటగా మారింది.