Begin typing your search above and press return to search.

స్వార్థం..అత్యాశ..అసహనం;సుప్రీం అన్న మాటలివి

By:  Tupaki Desk   |   19 July 2016 12:45 PM IST
స్వార్థం..అత్యాశ..అసహనం;సుప్రీం అన్న మాటలివి
X
సుప్రీం చీఫ్ జస్టిస్ నోరు విప్పారు. తన టేబుల్ మీదకు వచ్చిన కేసు విషయం మీద ఆయన స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో జడ్జి నియమకాలకు సంబంధించి సుప్రీంలో దాఖలైన వ్యాజ్యాన్ని విచారించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. వాటికి ఏదో ఒక భావోద్వేగాన్ని అంటించేసి.. మాటలకు పెడార్థాలు ఆపాదించే పరిస్థితి నెలకొంది.ఇలాంటి వేళ.. తన బెంచ్ మీదకు వచ్చిన కేసు సంబంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎక్కడా ఎలాంటి విశ్లేషణ లేకుండా.. కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సీజే చేసిన వ్యాఖ్యాల్ని చూస్తే..

అసలు వ్యాజ్యం ఏంటి?

ఆంధప్రదేశ్.. తెలంగాణ రాష్ట్రాలకు మధ్య జడ్జిల పంపకాలకు హైకోర్టు ఇచ్చిన ఆప్షన్లు.. చేపట్టిన ప్రక్రియను నిలిపివేయాలని తెలంగాణ జడ్జిల సంఘం.. కింది కోర్టుల జడ్జిల పంపాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియను హైకోర్టు రద్దు చేయటంపై స్టే ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో ఒక వ్యాజ్యం వేశారు. దీనికి సంబంధించి వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనంలో ఎవరెవరు ఉన్నారు?

జస్టిస్ టీఎస్ ఠాకూర్.. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్

ఠాకూర్ ఏమేం వ్యాఖ్యలు చేశారు?

‘‘విద్వేషాలతో ఈ పరిస్థితి సృష్టించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నిరసనలు చేశారు. ఈ పరిస్థితి తీవ్ర అసహనాన్ని సూచిస్తోంది. సమన్యాయం చేయటానికి మేం ఉన్నాం. తెలంగాణకు అన్యాయం జరగనివ్వం. విభజన అనేది నిబంధనల మేరకు జరగాలి’’

‘‘ఆప్షన్ల ప్రకారం పంపకాలు చేయాలా? వద్దా? ప్రక్రకియ చేప్టటేందుకు నియమ నిబంధనలు ఏమిటనేది నిర్థారించారా? లేదా? అసలు ఈ నియమ నిబంధనలను నిర్థారించే సంస్థ ఒకటి ఉంటుంది కదా. అది కేంద్రమా? హైకోర్టా? నిబందనలు సిద్ధమయ్యాయా? రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం ఏమిటి?’’

‘‘సమస్యను పెద్దగా.. వాతావరణాన్ని కలుషితం చేశారు. న్యాయ వ్యవస్థలో ఇలాంటి పరిస్థితులు సరికావు. తరతరాలుగా కలిసి ఉన్న సంగతి మర్చిపోవద్దు. విబజన తర్వాత విద్వేషాలు రెచ్చగొట్టటం సరికాదు. మళ్లీ హామీ ఇస్తున్నా.. ఎవరికీ అన్యాయం జరగదు. సమస్య పరిష్కారానికి కేంద్ర సర్కారు సహకరిస్తోంది. పంపకం చేసేది హైకోర్టా? కేంద్రమా? అన్నది పరిశీలిస్తాం’’

‘‘ఇలా చెబుతున్నందుకు మన్నించండి. వ్యక్తిగత స్వార్థాలు.. అత్యాశ కారణంగానే వ్యవహారం ఈ స్థితికి వచ్చింది. ఇంత తీవ్రస్థాయిలో అసహనం ఏమిటి? వాతావరణాన్ని కలుషితం చేశారు. సమస్యని పెద్దది చేశారు. న్యాయ వ్యవస్థలో ఇలా జరగరాదు. తరతరాలుగా కలిసే ఉన్నామని మర్చిపోద్దు. ఆ విషయాన్ని మరిచి విభజన తర్వాత విద్వేషాలు రెచ్చగొట్టటం సరికాదు. మేం పదే పదే చెప్పాం. అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చాం. అందరి ప్రయోజనాల్ని పరిరక్షిస్తాం’’

‘‘కేంద్ర ప్రభుత్వం కూడా సమస్యను పరిష్కరించటానికే కట్టుబడి ఉంది. కానీ.. వ్యక్తిగత అత్యాశలను మేం సంతృప్తి పర్చలేం. సముచితంగా.. సహేతుకంగా.. సక్రమంగా సమస్యను పరిష్కరిస్తాం’’