Begin typing your search above and press return to search.

కోర్టు ధిక్కార చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిల్

By:  Tupaki Desk   |   1 Aug 2020 5:00 PM GMT
కోర్టు ధిక్కార చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిల్
X
కోర్టు ధిక్కార చట్టం వాక్వ్సాతంత్రాన్ని ఉల్లంఘిస్తోందంటూ సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది. దేశ ప్రజలందరికీ రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛను ఇచ్చిందని, కానీ ఈ చట్టం మాత్రం దీనిని నిరుత్సాహపరుస్తోందని పిల్ దాఖలు చేసిన సీనియర్ పాత్రికేయులు ఎన్ రామ్, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్రమంత్రి అరుణ్ శౌరీలు పేర్కొన్నారు. ఐదు దశాబ్దాల నాటి ఈ కోర్టు ధిక్కార చట్టం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని, కాబట్టి ఇందులోని కొన్ని నిబంధనలు రద్దు చేయాలని కోర్టును కోరారు.

ఆక్షేపణకు గురౌతున్న సబ్‌సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ ప్రవేశికలోని విలువలతో ఇది పొసగడం లేదని ఆ పిల్‌లో పేర్కొన్నారు. ఇది అస్పష్టంగా ఉండటంతో పాటు నిరంకుశంగా ఉందన్నారు. కాగా, ప్రశాంత్ భూషణ్ పైన కోర్టు ధిక్కార ఆరోపణల నేపథ్యంలో ఈ పిల్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రజాస్వామ్యానికి విఘాతం కలగడంలో న్యాయవ్యవస్థ పాత్ర ఉందంటూ గతంలో ప్రశాంత్ భూషణ్ సోషల్ మీడియా ద్వారా తీవ్రవ్యాఖ్యలు చేశారు. దీనిపై గత నెలలో న్యాయస్థానం స్పందించింది. ఆయన వ్యాఖ్యలు భారత అత్యున్నత న్యాయవ్యవస్థ హోదా, అధికారం పట్ల, భారత ప్రధాన న్యాయమూర్తి పదవి పట్ల ప్రజల దృష్టిలో చులకన చేసేలా ఉందని పేర్కొంది. ఇది కోర్టు ధిక్కార చర్య అని, అయినప్పటికీ ఈ ట్వీట్లు ఎందుకు తొలగించలేదో చెప్పాలంటూ ట్విట్టర్ ఇండియాను కూడా ప్రొసిడీంగ్స్‌లో చేర్చింది. తదుపరి విచారణ ఆగస్ట్ 4న ఉంది. పాత్రికేయులు ఎన్ రామ్, అరుణ్ శౌరీలు కూడా కోర్టు ధిక్కార కేసులు ఎదుర్కొంటున్నారు.