Begin typing your search above and press return to search.

దీపావళి టపాసులు కాల్చేందుకు టైమిచ్చారు

By:  Tupaki Desk   |   29 Oct 2015 4:56 AM GMT
దీపావళి టపాసులు కాల్చేందుకు టైమిచ్చారు
X
రోజులు గడుస్తున్న కొద్దీ ప్రతి విషయంలోనూ పరిమితులు.. ఆంక్షలు పెరిగిపోతున్నాయి. సంప్రదాయంగా వస్తున్న పండగలు.. పర్వదినాల్ని ఎలా నిర్వహించుకోవాలన్న విషయాలు సైతం న్యాయస్థానాలు చెప్పే పరిస్థితి. దీపావళి సందర్భంగా కాల్చే టపాసుల విషయంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారించి నిర్ణయాన్ని వెల్లడించింది. దీపావళి సందర్భంగా కాల్చే టపాసుల్ని పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ పిల్ దాఖలైంది.

ఇలా దాఖలు చేసిన వారు కేవలం 3 నుంచి 14 నెలల వయసున్న ముగ్గురు శిశువులు కావటం గమనార్హం. వారి తరఫున వారి తల్లిదండ్రులైన న్యాయవాదులు ఈ పిల్ ను దాఖలు చేశారు. కాలుష్య రహిత వాతావరణం చిన్నారుల హక్కుగా తమ పిటీషన్ లో పేర్కొన్న న్యాయవాదులపై సుప్రీం తన నిర్ణయాన్ని వెల్లడించింది. బుధవారం పిటీషన్ ను విచారించిన సుప్రీంకోర్టు దీపావళి సందర్బంగా అనుసరించాల్సిన మార్గదర్శకాల్ని వెల్లడించారు.

పండగ నాడు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యన టపాసులు కాల్చొద్దని స్పష్టం చేసింది. అంతేకాదు.. అక్టోబరు 31 నుంచి నవంబరు 12 వరకు వాయు కాలుష్యం మీద ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని కూడా ప్రభుత్వాలను ఆదేశించింది. టపాసులు కాల్చటాన్ని పూర్తిగా నిషేధించలేదని చెప్పిన సుప్రీం నిర్ణయంతో పండగపూట ఉదయం నుంచి రాత్రి పది గంటల లోపు మాత్రమే టపాసులు కాల్చాల్సి ఉంటుంది.