Begin typing your search above and press return to search.

సుప్రీం ప్రశ్నకు పార్టీల సమాధానం ఏమిటి..?

By:  Tupaki Desk   |   11 July 2015 9:27 AM GMT
సుప్రీం ప్రశ్నకు పార్టీల సమాధానం ఏమిటి..?
X
ప్రజలకు సేవ చేయటానికే రాజకీయ పార్టీలు ఉన్నాయని ప్రతిఒక్కరూ చెబుతుంటారు. మరి.. రాజకీయ పార్టీలన్నీ ప్రజలకు ఏ రేంజ్‌లో సేవ చేస్తున్నాయో అందరికి తెలిసిన విషయమే. ప్రజల కోసం తమ ప్రాణాలు సైతం పణంగా పెడతామని లెక్చర్లు దంచే పార్టీలు.. చేతల్లో చూసినప్పుడు ఎలా ఉంటాయో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

రాజకీయ పార్టీల్ని ప్రజారంగ సంస్థలుగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ తాజాగా సుప్రీంకోర్టు ఆరు రాజకీయ పార్టీల్ని ప్రశ్నించింది. ఒక స్వచ్ఛంద సంస్థ వేసిన పిటీషన్‌పై జరుగుతున్న విచారణలో భాగంగా సుప్రీం కోర్టు.. బీజేపీ.. కాంగ్రెస్‌తో సహా మరో నాలుగు పార్టీలను తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరింది.

ఇప్పటివరకూ ఉన్న చట్టాల ప్రకారం.. రాజకీయ పార్టీలు తమకు వచ్చే విరాళాలకు సంబంధించి రూ.20వేలకు పైబడి మాత్రమే వివరాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. రూ.20వేల లోపు అందే విరాళాలకు సంబంధించిన వివరాల్ని పార్టీలు ఎందుకు వెల్లడించకూడదన్నది పిటీషనర్‌ ప్రశ్న. చట్టంలో ఉన్న నిబంధనల్లోని మినహాయింపుల్ని ఆసరాగా చేసుకొని.. రాజకీయ పార్టీలకు అందే విరాళాల్లో ఎక్కువ భాగం రూ.20వేల కంటే తక్కువగా ఉండేలా చూస్తున్న పరిస్థితి అన్న ఆరోపణ ఉంది.

అందుకే.. రూ.20వేల లోపున పార్టీలకు అందే విరాళాల్ని సైతం ప్రకటించాలని కోరుతున్నారు. తమ బంగారుపుట్టలో వేలు పెట్టకుండా ఎలాంటి ప్రజాసేవకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే రాజకీయ పార్టీలు.. తాజాగా సుప్రీం సంధించిన ప్రశ్నకు ఏం సమాధానం చెబుతాయో చూడాలి.