Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రికి షాకిచ్చిన సుప్రీం .. అక్రమాస్తులపై సీబీఐ కేసు !

By:  Tupaki Desk   |   2 Sep 2021 11:30 AM GMT
ఏపీ మంత్రికి షాకిచ్చిన సుప్రీం .. అక్రమాస్తులపై సీబీఐ కేసు !
X
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ విద్యాశాఖ మంత్రి, మాజీ ఐఆర్‌ ఎస్‌ అధికారి ఆదిమూలపు సురేశ్‌, ఆయన సతీమణి ఐఆర్‌ ఎస్‌ అధికారి టీఎన్‌ విజయలక్ష్మిపై ప్రాథమిక విచారణ జరిపి, ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేయాలని దేశ అత్యన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక విధంగా ఇబ్బంది కలిగించే అంశమే. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పుబట్టిన సుప్రీం.. సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సీబీఐ లాంటి సంస్థలు అధికారులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి సమయంలో జాగ్రత్త వహించాలని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ మేరకు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ డీవై చంద్రచూడ్ తో కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఈ కేసు పై విచారణను మరో రెండు వారాల పాటు వాయిదా వేసింది. ప్రస్తుత ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన సతీమణి విజయ లక్ష్మి ఇద్దరూ ఐఆర్ ఎస్ అధికారులు. ఉద్యోగాన్ని వదిలిపెట్టిన సురేష్, రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం సీఎం జగన్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. 2016లో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిఉన్నారనే ఆరోపణలపై సీబీఐ 2016లో దేశవ్యాప్తంగా పలువురు ఐఆర్‌ ఎస్‌ అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది.

ఆ సమయంలో విజయలక్ష్మిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసి, 2017లో ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదైంది. ఇందులో ఏ-1గా విజయలక్ష్మి, ఏ-2గా ఆదిమూలపు సురేష్ ను పేర్కొన్నారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ ను సురేష్ దంపతులు తప్పుబట్టారు. సీబీఐ ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిల్ లలిత కుమారి నేతృత్వంలోని ధర్మాసనం, మంత్రి దంపతులకు అనుకూలంగా ఆదేశిలిచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.

సుప్రీం కోర్టులో జరిగిన విచారణలో సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. అన్ని ఆధారాలతోనే సీబీఐ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం. ఆ విషయాన్ని అఫిడవిట్ లో ఎందుకు పొందుపర్చలేదో చెప్పాలంది. మళ్లీ ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు వర్చువల్‌ విధానంలో ఈ కేసును విచారించిందని పేర్కొన్న ధర్మాసనం, ఆతీర్పును పక్కన పెడుతున్నామని, ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ జరిపారో లేదో సమాధానం చెప్పాలని సీబీఐని కోరింది. అదేసమయంలో మరోసారి ప్రాథమిక విచారణ జరిపి, తాజాగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది.