Begin typing your search above and press return to search.

భేష్: ఆమె అబార్షన్ కు సుప్రీం ఓకే

By:  Tupaki Desk   |   26 July 2016 4:41 AM GMT
భేష్: ఆమె అబార్షన్ కు సుప్రీం ఓకే
X
చట్టంలో ఉన్న అంశాల్ని ఉన్నట్లుగా అమలు చేయటం పెద్ద విషయమేమీ కాదు. కానీ.. సమయం.. సందర్భానికి తగినట్లుగా వ్యవహరిస్తూ.. ‘విచక్షణ’తో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కొన్నిసార్లు ఉంటుంది. ఇలాంటి వేళ.. చట్టం చెప్పలేదంటూ ఊరకుండిపోకుండా.. అవసరమైతే చట్టంలోని కొన్ని అంశాల్ని మార్చేందుకు సైతం వెనుకాడ కూడదు. తాజాగా ఒక కేసు ఉదంతంలో సుప్రీం ఇలాంటి నిర్ణయమే తీసుకోవటంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 1971 నాటి అబార్షన్ చట్టంలోని అంశాల ప్రకారం 20 వారాలు నిండిన పిండానికి ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయకూడదు. అయితే.. తాజాగా తమ ముందుకు వచ్చిన అసాధారణ కేసు విషయంలో స్పందించిన సుప్రీం అబార్షన్ చేయటానికి ఓకే చెబుతూ నిర్ణయం తీసుకుంది.

ఒక అత్యాచార బాధితురాలి కడుపులో పెరుగుతున్న పిండం అసాధారణ రీతిలో ఉండటం.. దాన్ని కాని అబార్షన్ చేయకుంటే తల్లికి శారీరకంగా.. మానసికంగా తీవ్ర సమస్యలు ఎదురుకావటంతో పాటు.. ఆమె ప్రాణానికి సైతం ప్రమాదకరంగా మారుతుందన్న వాదనతో ఒక కేసు సుప్రీం దృష్టికి వచ్చింది. దీనిపై విచారించిన కోర్టు.. 24 వారాలున్న పిండం పరిస్థితి బాగోలేకపోవటం.. దాని కారణంగా తల్లి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో అబార్షన్ కు ఓకే చెబుతూ నిర్ణయం తీసుకుంది. 1971 అబార్షన్ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం 20 వారాలలోపు పిండానికి మాత్రమే అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి ఉంది. కానీ.. తాజా ఉదంతంలో గర్భస్రావం చేయించకుంటే తల్లి ప్రాణానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉండటంతో.. ఈ చట్టం ఈ కేసుకు వర్తించదంటూ అటార్నీ జనరల్ వాదనను సుప్రీం ఏకీభవిస్తూ.. అబార్షన్ చేయించుకునేందుకు అత్యాచార బాధితురాలికి అనుమతిని ఇచ్చింది.