Begin typing your search above and press return to search.

కేంద్రప్రభుత్వానికి ఫైన్ వేసిన కోర్టు!

By:  Tupaki Desk   |   12 Aug 2016 7:58 AM GMT
కేంద్రప్రభుత్వానికి ఫైన్ వేసిన కోర్టు!
X
ఈ మధ్యకాలంలో ప్రభుత్వాల నిర్ణయాలపైనా - వాటి పనితీరుపైనా - ఆయా శాఖల్లో జరుగుతున్న కార్యకలాపాలపైనా కోర్టులు మొట్టికాయలు వేస్తున్న సందర్భాలు ఎన్నో జరుగుతున్నాయి. అవి రాష్ట్ర ప్రభుత్వాలైనా - కేంద్రప్రభుత్వమైనా.. మొట్టికాయలు మాత్రం కామన్! అంటే.. కోర్టులు జోక్యంచేసుకుని మరీ ప్రభుత్వాలను మేల్కొల్పే పరిస్థితి రావడం దారుణమనే చెప్పాలి. తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వంపై చేసిన కామెంట్స్ చూస్తే.. ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం మరోసారి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.

రోడ్డు ప్రమాదాల విషయంలో సమాధానం ఇంతవరకు పంపకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ నిర్లక్ష్యానికీ - ఆలస్యానికీ బాధ్యులను చేస్తూ రవాణా మంత్రిత్వశాఖకు రూ. 25వేల జరిమానా కూడా విధించింది. ఈ విషయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ కేంద్రంపై ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ఈ వ్యాఖ్యలు విన్న ప్రతిఒక్కరూ.. ప్రభుత్వాలు ఇకనైనా తమ నిర్లక్ష్య దోరణికి పాడాలి చరమ గీతం అని చెబుతున్నారు.

ఈ సందర్భంగా జస్టీస్ టీఎస్ ఠాకూర్ స్పందిస్తూ.. ప్రభుత్వమే అతిపెద్ద లిటిగెంట్ అని అభిప్రాయపడ్డారు. అసలు లిటిగెంట్స్ ప్రభుత్వాలే.. అయినా కూడా కోర్టులు సరిగా పనిచేయలేదంటూ (ప్రభుత్వ పెద్దలు) వ్యాఖ్యానిస్తుంటారని అన్నారు! ఇప్పటికి దాదాపు ఏడాది కాలం గడిచినా కూడా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయలేదని, ఇక్కడేమైనా పంచాయతీ నడుస్తోందని అనుకుంటున్నారా అని తీవ్రంగా వ్యాఖ్యానించారు ఠాకూర్. దీంతో ఉలిక్కిపడిన కేంద్ర కోర్టు వ్యాఖ్యలపై స్పందించింది. మరో మూడు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం తన సమాధానాన్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేస్తుందని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు సమాధానమిచ్చారు.