Begin typing your search above and press return to search.

'గాలి' కేసు విచారణపై సుప్రీం తీవ్ర ఆగ్రహం

By:  Tupaki Desk   |   15 Sep 2022 5:23 AM GMT
గాలి కేసు విచారణపై సుప్రీం తీవ్ర ఆగ్రహం
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారి.. అప్పట్లో హాట్ టాపిక్ అయిన గాలి జనార్దనరెడ్డి గనుల వ్యవహారం ఉదంతంపై కేసు నమోదు చేసి అప్పుడే పన్నెండేళ్లు అయ్యింది. ఇంతటి కీలకమైన కేసుకు సంబంధించిన విచారణ సుదీర్ఘకాలంగా సాగుతున్న ఆలస్యంపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ జాప్యంపై తాజాగా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంత ఆలస్యాన్ని తాము సహించలేమన్న సుప్రీం.. గతంలో తాము విచారణకు ఆదేశాలు జారీ చేసినా ఆలస్యం ఎందుకు అయ్యిందో చెప్పాలని.. తాము చెప్పిన తర్వాత కూడా విచారణ ముందుకు సాగకపోవటం వెనుకున్న కారణం ఏమిటో తెలియజేయాలని పేర్కొంటూ హైదరాబాద్ లోని సీబీఐ కేసుల కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి ధర్మాసనం వాయిదా వేసింది. తమ వివరణను సీల్డ్ కవర్ లో పంపాలని పేర్కొంది.

గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో తొమ్మిది మందిపైన 2009లో సీబీఐ కేసులు నమోదు చేసింది. అనంతరం ఆయన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఏపీలోని కడప.. అనంతపురం జిల్లాలకు వెళ్లొద్దన్న షరతులతో సుప్రీంకోర్టు ఆయనకు 2015లో బెయిల్ మంజూరుచేసింది. కోర్టు ఆదేశాల్ని ఫాలో అవుతున్న నేపథ్యంలో బెయిల్ షరతుల్ని సడలించాలని కోరుతూ గాలి 2020లో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ఎస్పీలకు ముందస్తు సమాచారం ఇవ్వటం ద్వారా ఆయా జిల్లాలకు వెళ్లొచ్చంటూ సుప్రీం ఆదేశాల్ని జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన పిటిషన్ తాజాగా సుప్రీం ధర్మాసనం ముందుకు వచ్చింది.

గాలి జనార్దన్ రెడ్డి సొంతూరు అయిన బళ్లారిలో ఆయన ఉంటే.. సాక్ష్యుల్ని ప్రభావితం చేస్తారని.. వారి ప్రాణాలకు ముప్పు ఉందని ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై స్పందించిన సుప్రీం జడ్జి.. సీబీఐ కేసు విచారణ ఏ దశలో ఉందని ప్రశ్నించగా.. అదనపు సొలిసిటర్ జనరల్ మాధవి దివాన్ బదులిస్తూ.. విచారణ సాగటం లేదన్నారు.

విచారణపై స్టే ఉందా? అని న్యాయమూర్తి అడగ్గా.. గతంలో అయితే లేదన్నారు. గతం గురించి తాను అడగటం లేదని.. ప్రస్తుత పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనికి అదనపు సొలిసిటర్ జనరల్ వద్ద సరైన సమాచారం లేకపోవటంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తీవ్రమైన అభియోగాలు ఉన్న ఈ అంశంపై కేసు నమోదైన 12 ఏళ్ల తర్వాత విచారణ జరగకపోవటందురద్రష్టకరమన్న సుప్రీం.. దీనికి సంబంధించిన నివేదికను తమకు పంపాలన్నారు. ప్రస్తుతం ట్రయల్ కోర్టులో విచారణ ఏ దశలో ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ.. తమకు నివేదిక అందజేయాలని ఆదేశించింది. సుప్రీం పుణ్యమా అని.. గాలి కేసులో కదలిక వచ్చినట్లుగా చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.