ఒక పార్టీ తర్వాత మరో పార్టీ చొప్పున ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా ఫోకస్ అంతా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విషయం తెలిసిందే. కేవలం ఎంపీలు.. ఎమ్మెల్యేలు మాత్రమే కాదు. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్.. ప్రజాభిమానం.. పలుకుబడి ఉన్న నేతలందరిపై ఆయన కన్ను వేస్తున్నారు. ప్రత్యర్థి కోలుకోకుండా దెబ్బ కొట్టే తత్వం ఉన్న కేసీఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరికొన్నేళ్లు కోలుకోకుండా ఉండాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలు గులాబీ కారు ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నేత కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలక పదవుల్ని చేపట్టిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.గులాబీ కారు ఎక్కే కాంగ్రెస్ నేతల జాబితాలో ఆమెదే తర్వాతి మార్పుగా చెబుతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ సర్కారులో మంత్రిగా వ్యవహరించిన ఆమె.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.
ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి క్రియాశీల రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేని ఆమె.. తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మారటమే మంచిదన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో టీఆర్ ఎస్ ను కొట్టే పార్టీ ఏదీ ఉండదన్నట్లుగా రాజకీయ వాతావరణం ఉన్న నేపథ్యంలో పార్టీ మారటానికి ఇదే సరైన సమయంగా సునీతా లక్ష్మారెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు.
నిజానికి ఆమె రాజకీయ జీవితం ఆసక్తికరంగా ఉంటుంది. అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ఎన్నోకీలక పదవుల్ని చేపట్టే స్థాయికి ఎదగటం విశేషంగా చెప్పాలి. సునీతారెడ్డి భర్త లక్ష్మారెడ్డి యువజన కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉండేవారు. జెడ్పీటీసీగా వ్యవహరించిన ఆయన 1999 ఎన్నికల్లో నర్సాపూర్ అసెంబ్లీ స్థానానికి టికెట్ కోసం ఆశించారు. ఆయనకు సీటు ఇవ్వటం కన్ఫర్మ్ అయిన తర్వాత చోటు చేసుకున్న మార్పులతో ఆయనకు బదులుగా మాజీ ఉప ముఖ్యంత్రి జగన్నథరావుకు టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించటం.. ఈ నిర్ణయం తీవ్రంగా కుమిలిపోయిన లక్ష్మారెడ్డి గుండె ఆకస్మాత్తుగా ఆగిపోయింది. ఊహించని ఈ పరిణామంతో తప్పు తెలుసుకున్న కాంగ్రెస్ అధినాయకత్వం తన తప్పును సరి చేసుకోవటానికి వీలుగా లక్ష్మారెడ్డి సతీమణి సునీతకు టికెట్ కేటాయించారు.
భర్త కన్నుమూసి.. పుట్టెడు శోకంలో ఉన్నప్పటికి గుండె దిటువ చేసుకొని అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ అధికారంలో రాని నేపథ్యంలో విపక్షంగా ఉండిపోయారు. 2004..2009 జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్.. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పని చేసిన ఆమె.. కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయురాలిగా పేరుంది. కమిట్ మెంట్ కు మారుపేరుగా ఉన్న ఆమె.. తాజాగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే కేరాప్ అడ్రస్ అని చెప్పుకునే నేతలే పార్టీ మారిపోతున్న నేపథ్యంలో.. తాను పార్టీ మారటం తప్పు కాదన్న భావనకు సునీతాలక్ష్మారెడ్డి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆమె ఆసక్తికి తగ్గట్లే.. టీఆర్ ఎస్ చీఫ్ సైతం ఆమె రాక పట్ల సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు సాగితే.. సునీతా లక్ష్మ్రారెడ్డి గులాబీ కండువా కప్పుకొని కారు ఎక్కే రోజు దగ్గర్లోనే ఉందని చెబుతున్నారు. అదే జరిగితే తెలంగాణ కాంగ్రెస్ కు మరో దెబ్బ పడినట్లేనని చెప్పక తప్పదు.