Begin typing your search above and press return to search.

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ చేసిన పని తెలిస్తే ఫిదానే

By:  Tupaki Desk   |   23 April 2023 12:09 PM GMT
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ చేసిన పని తెలిస్తే ఫిదానే
X
‘వావ్’ అనేలా వ్యవహరించారు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి. దివంగత మహానేత వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఆమె.. తర్వాత కాలంలో రాజకీయంగా ఇబ్బందులకు గురైనా.. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆమెకు పదవి దక్కింది. సమర్థత ఉన్నప్పటికీ కొన్నిసార్లు అవకాశాలు దక్కవు. ఆ కోవలోకే వస్తారు సునీతా లక్ష్మారెడ్డి. తనకు లభించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ సద్వినియోగం చేసుకుంటున్నారు.

తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని చూసినప్పుడు ఆమె స్పందించిన తీరును అభినందనలు చెప్పాల్సిందే. అసలేం జరిగిందంటే..

అందోల్ మండలం సంగుపేటకు చెందిన సురేశ్ ఆటోడ్రైవర్ గా పని చేస్తుంటాడు. అతడు దొంగతనాల్ని చేస్తుంటాడు. అతడికి అతడి భార్య కూడా సహకరిస్తుంటుంది. భర్త ఆటోలో సాధారణ ప్రయాణికులురాలిగా నటిస్తూ.. ప్రయాణికులను దోచుకునేందుకు సాయం చేస్తుంటుంది. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల వేళలోఇస్తాయిల్ ఖాన్ పేటకు చెందిన అమ్రత అనే మహిళా నర్సాపూర్ వెళ్లేందుకు వీళ్ల ఆటోఎక్కారు. ఆటోలో మహిళ ఉండటంతో.. ధైర్యంగా ఎక్కారు.

ఆటో కొంత దూరం వెళ్లిన తర్వాత సురేశ్ ఆటోను పక్కన నిలిపి.. కత్తి తీసి బెదిరించి.. పుస్తెలతాడు లాక్కున్నాడు. ఆటోలో వెళ్లిపోయాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక రోదిస్తూ ఉండిపోయింది అమ్రత. ఈ క్రమంలో అటు వైపు తన కాన్వాయ్ లో వెళుతున్నారు సునీతా లక్ష్మారెడ్డి. బాధిత మహిళ చేతులు అడ్డం పెట్టి ఆపమని కోరటంతో తన వాహనాన్ని నిలిపిన సునీత విషయాన్ని తెలుసుకున్నారు.

వెంటనే.. తన కాన్వాయ్ లో ఉన్న పోలీసులకు చెప్పి.. సదరు ఆటోను తీసుకురావాలని ఆదేశించారు. వెంటనే స్పందించిన పోలీసులు రంగంలోకి దిగి.. కిలో మీటర్ ఛేజ్ చేసి ఆటోనుపట్టుకున్నారు. ఆటో డ్రైవర్.. సదరు మహిళాభార్యభర్తలుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద ఉన్న బాధిత మహిళ పుస్తెల తాడు ఇప్పించటంతో పాటు.. నిందితుల్ని పోలీసులకు అప్పజెప్పారు.

దీంతో వారిద్దరిని రిమాండ్ కు పంపారు పోలీసులు. రీల్ లో మాదిరి రియల్ లైఫ్ లోనూ టి మహిళా కమిషన్ చైర్ పర్సన్ వ్యవహరించిన తీరును పలువురు అభినందిస్తున్నారు.