Begin typing your search above and press return to search.

మహాసంకల్పంలో ‘గొంతు’ కలిపారు

By:  Tupaki Desk   |   22 Oct 2015 12:06 PM IST
మహాసంకల్పంలో ‘గొంతు’ కలిపారు
X
ఒకరిదేమో కంచు కంఠం.. ఇంకొకరిది మృదుమధుర స్వరం.. ఒకరు మాటల్లో ఘనాపాఠి అయితే, ఇంకొకరు పాటల్లో తనకుతానే సాటి. అలాంటి ఆ ఇద్దరూ అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వ్యాఖ్యానం చెబుతుంటే వారి స్వరాన్ని వినిపిస్తున్నందుకు మైకులు కూడా మురిసిపోతున్నాయట. ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు సాయికుమార్ - ఇంకొకరు గాయని సునీత. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాన అమరావతి నిర్మాణానికి నిర్వహిస్తున్న శంకుస్థాపన కార్యక్రమంలో తమ వ్యాఖ్యానంతో ఆకట్టుకుంటున్న సాయికుమార్, సునీత లు ఈ అవకాశాన్ని తమకు లభించిన గొప్ప అవకాశంగా చెబుతున్నారు.

వందల సినిమాలకు డబ్బింగ్ చెప్పినప్పటికీ తనకు గొంతు వణుకుతోందని సాయికుమార్ అంటుంటే ఎన్నో పాటలు పాడిన తనకు ఇంత ఉద్విగ్నం ఏనాడూ కలగలేదని సునీత అంటున్నారు. ఒత్తిడికి గురవుతున్నప్పటికీ రెండు రోజులుగా రిహార్సల్సు చేస్తున్నట్టు వారు చెబుతున్నారు. మానవ సంకల్పంతో మహాసంకల్పంగా సాగుతున్న అమరావతి నిర్మాణంలో ఇలాంటి అవకాశం రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని సాయికుమార్ అన్నారు. అమరేశ్వరుని ఆశీస్సుల వల్లే చరిత్రాత్మక కార్యక్రమంలో పాలుపంచుకోగలుతున్నానని సునీత చెప్పారు .

కాగా సాయికుమార్ , సునీతల వ్యాఖ్యానం సభకు కొత్త ఆకర్షణ తెచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తియ్యని గొంతు, గౌరవ మర్యాదలు ఉట్టిపడే హావభావాలు, ప్రశాంత వదనంతో ఈ ఇద్దరూ సభా వేదికకు అలంకారంగా మారారు.

Buy Bricks Online and Contribute to Amaravathi : http://amaravati.gov.in/EBRICKS/Index.aspx