Begin typing your search above and press return to search.

వైఎస్‌ అవినాష్‌ కు షాక్‌.. సుప్రీంను ఆశ్రయించిన సునీత!

By:  Tupaki Desk   |   20 April 2023 11:54 AM GMT
వైఎస్‌ అవినాష్‌ కు షాక్‌.. సుప్రీంను ఆశ్రయించిన సునీత!
X
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని ఏప్రిల్‌ 25 వరకు అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించడాన్ని సవాల్‌ చేస్తూ వైఎస్‌ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తున్నట్టు తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ముందు సునీత పిటిషన్‌ ను సీనియర్‌ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 21న సునీత పిటిషన్‌ ను విచారణకు స్వీకరిస్తామని సీజేఐ చంద్రచూడ్‌ తెలిపారు. దీంతో ఏప్రిల్‌ 21 సునీత పిటిషన్‌ విచారణకు రానుంది.

కాగా వివేకా హత్య కేసులో అవినాశ్‌ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై తెలంగాణ హైకోర్టు ఏప్రిల్‌ 25న తుది తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 25వ తేదీ వరకు ప్రతిరోజూ అవినాశ్‌ రెడ్డి సీబీఐ ఎదుట హాజరుకావాలని హైకోర్టు సూచించింది.

అలాగే ఆయన విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ అధికారులు ప్రశ్నలను ఎంపీకి లిఖితపూర్వకంగా అందజేయాలని హైకోర్టు సూచించింది. అలాగే అవినాశ్‌ రెడ్డి ఇచ్చే సమాధానాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఆ విచారణకు సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించాలి అని హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయనను అప్పటివరకు అరెస్టు చేయొద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సునీత సుప్రీంకోర్టులో తాజాగా సవాలు చేశారు.

కాగా హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ పై వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ.. వివేకా హత్యలో అవినాశ్‌ రెడ్డి పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని అవినాశ్‌ రెడ్డి చెప్పినట్లు అప్పటి సీఐ శంకరయ్య స్టేట్‌మెంట్‌ ఇచ్చారని గుర్తు చేశారు. పిటిషనర్‌ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఆధారాలను నాశనం చేశారన్నారు. హత్య వెనుక విస్తృత కుట్ర ఉందని స్వయంగా సుప్రీంకోర్టు గుర్తించిందని తెలిపారు. పిటిషనర్‌కు వ్యతిరేకంగా కొలేటరల్‌ ఎవిడెన్స్‌ ఉంది అని సునీత న్యాయవాది వివరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని ఏప్రిల్‌ 25 వరకు అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.