Begin typing your search above and press return to search.

జియోతో ఏం జరిగిందో చెప్పిన ఎయిర్ టెల్ అధినేత

By:  Tupaki Desk   |   17 April 2021 6:30 AM GMT
జియోతో ఏం జరిగిందో చెప్పిన ఎయిర్ టెల్ అధినేత
X
దేశీయంగా జియో ఎంతటి సంచలనమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దేశీయ టెలికం రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ముకేశ్ అంబానీ జియో పుణ్యమా అని.. ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్న విషయాన్ని ఎయిర్ టెల్ అధినేత సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశీయ టెలికం పరిశ్రమపై జియో ముద్ర.. దేశ భవిష్యత్తుపై ఆయన ఓపెన్ అయ్యారు.

ఏడాది పాటు ఉచిత సేవలు.. తదుపరి ఏడాది రాయితీ సేవలు.. మార్కెట్ ను కొల్లగొట్టే టారిఫ్ లు.. సబ్సిడీ ఫోన్లు.. వీటి ఫలితంగా దేశీయంగా 12 మంది ఆపరేటర్లలో తొమ్మిది మంది తట్టాబుట్టా సర్దుకోవాల్సి వచ్చింది. లేదంటే.. దివాలా తీశారు. ఇది కూడా కాదంటే.. తమతో విలీనం కావాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా ముగ్గురు ఆపరేటర్లు మాత్రమే మిగిలారని.. వీరిలో ఒకరు భారీగా ఎదగటం ప్రశ్నార్థకంగా ఆయన వ్యాఖ్యానించారు.

అయితే.. తమ కంపెనీ ఇప్పటికే మూడు.. నాలుగు సంక్షోభాల్ని తట్టుకొని పటిష్టమైన స్థితికి చేరుకున్నట్లు చెప్పారు. వ్యాపారాలకు భారత్ గొప్ప వేదిక అని.. సేవల్ని పెద్ద ఎత్తున ఉపయోగించే ఎంతోమంది వినియోగదారులు ఉన్న మార్కెట్ గా పేర్కొన్నారు. భారత్ పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షిస్తోందని.. రెస్టారెంట్లు మొదలు అన్నింటిలోనూ డెలవరీ సేవలు.. ఇతరత్రా వ్యాపారాలు డిజిటివ్ వేదికగా మార్పులు చోటు చేసుకుంటాయన్నారు.

చాలామంది చైనా నుంచి తమ వ్యాపారాల్ని భారత్ కు మార్చాలని అనుకుంటున్నారని.. దీంతో భారత్ లో మరింత తయారీ రంగం పెరుగుతుందని పేర్కొన్నారు. రానున్న ఐదు నుంచి పదేళ్లలో బారత్ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జియో దేశీయ టెలికం రంగాన్ని ఎంతలా ప్రభావితం చేశారన్న విషయాన్ని సునీల్ మిట్టల్ సింఫుల్ మాటల్లో చెప్పేశారు కదా!