Begin typing your search above and press return to search.

స‌ర్కారు షాక్..ఉచిత కాల్స్ ఉండ‌వ‌ట‌!

By:  Tupaki Desk   |   30 Oct 2019 8:43 AM GMT
స‌ర్కారు షాక్..ఉచిత కాల్స్ ఉండ‌వ‌ట‌!
X
రిలయన్స్‌ జియో రాకతో దేశీయ టెలికం పరిశ్రమ ముఖచిత్రం మారిపోగా - ఉచిత కాల్స్‌ - చౌక డాటా ఆఫర్లకు తెర లేచింది. అయితే, ఇటీవ‌లే ఉచిత కాల్స్ విప్ల‌వంతో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకున్న జియో...కాల్ చార్జీలు వ‌సూలు చేస్తున్నట్లు తెలిపి షాక్ ఇచ్చింది. త్వ‌ర‌లో...మిగ‌తా సంస్థ‌లు అదే బాట‌లో న‌డ‌వ‌నున్నాయి. జియో ఇంటర్‌ కనెక్ట్‌ యూసేజ్‌ చార్జీ (ఐయూసీ)లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతో టాప్‌ అప్‌ లు తెరపైకి రాగా - కస్టమర్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ త‌రుణంలోనే...అలాంటిది ఉచిత కాల్స్‌ ఆఫర్‌ కూడా దూరం కానుంద‌ని స‌మాచారం. ఇంతేకాదు...అలాగే ఎడాపెడా ఇంటర్నెట్‌ ను వినియోగిస్తున్న కస్టమర్లకూ ధరల మోత మోగనుంది. ఇంత‌కీ ఎందుకంటారా...టెలీ కమ్యూనికేషనేతర వ్యాపారం నుంచి వచ్చే ఆదాయాన్నీ వార్షిక సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్‌) లెక్కింపులో కలుపాలన్న కేంద్రం వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించ‌డం వ‌ల్ల‌.

టెలికం కంపెనీల వార్షిక ఏజీఆర్‌ పై సుప్రీం కోర్టు ఇటీవలి ఆదేశాలు.. పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. దీంతో టెలికం శాఖకు టెల్కోలు మూడు నెలల్లోగా రూ.1.42 లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. స‌హ‌జంగానే...ప్రధాన టెలికం ఆపరేటర్లు భారతీ ఎయిర్‌ టెల్‌ - వొడాఫోన్‌ ఐడియాలు ఇప్పుడు దీనిపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. భారతీ ఎయిర్‌ టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ - ఆయన సోదరుడు రాజన్‌ మిట్టల్‌.. టెలికం శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ - ఆ శాఖ కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ లను కలిసి పరిశ్రమను ఆదుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో టెల్కోల కష్టాలపై కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కార్యదర్శుల కమిటీకి క్యాబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా నేతృత్వం వహించనున్నారు. ఆర్థిక - న్యాయ - టెలికం శాఖల కార్యదర్శులు ఈ కమిటీలో ఉండనున్నారు.

ఈ క‌మిటీ టెలికం సంస్థలు ఎదుర్కొంటున్న అన్ని రకాల ఆర్థిక సమస్యలు-ఒత్తిళ్లపై అధ్యయనం చేయడంతో పాటుగా - వారి డిమాండ్లనూ పరిశీలించనున్నారు. అలాగే ఓ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ కోసం కూడా ప్ర‌య‌త్నించ‌నుంది. ఈ క్రమంలోనే ఆయా టెలికం సంస్థల ఆదాయం పెరిగే మార్గాలను కమిటీ అన్వేషించనుంది. పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వానికి ఈ సిఫార్సులను కమిటీ చేయనుందని అంటున్నారు. ఇందులో భాగంగానే టెలికం కంపెనీల ఆదాయాన్ని ప్రభావితం చేస్తున్న ఉచిత మొబైల్‌ ఫోన్‌ కాల్స్‌ - చౌక డాటా ఆఫర్లను ఆపేయాలని కేంద్రానికి కమిటీ నివేదిక ఇవ్వొచ్చని తెలుస్తున్నది. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు అందిస్తున్న ఉచిత ఆఫర్లన్నింటినీ వెనుకకు తీసుకోవాలన్న సూచనల్ని కమిటీ చేసే వీలుందని టెలికం శాఖ వర్గాల సమాచారం. టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌.. వాయిస్‌ ఫోన్‌ కాల్స్‌ - డాటా సర్వీసులకు కనీస చార్జీలను ప్రకటించే అవకాశాలున్నాయి. అప్పుడు అన్ని సంస్థలు వీటిని విధిగా పాటించాల్సిందే. దీంతో, మ‌న జేబుల‌కు బొక్క ప‌డ‌టం ఖాయం.