Begin typing your search above and press return to search.

ఈ వాద‌న విన్నారా?: జ‌గ‌న్ గెలిచింది బీజేపీ పుణ్య‌మేన‌ట‌!

By:  Tupaki Desk   |   23 July 2019 8:13 AM GMT
ఈ వాద‌న విన్నారా?: జ‌గ‌న్ గెలిచింది బీజేపీ పుణ్య‌మేన‌ట‌!
X
ఉట్టికి ఎగ‌ర‌లేన‌మ్మ‌.. స్వ‌ర్గానికి ఎగిరిన సామెత విన్నారా? ఏపీలో ఒక్క‌టంటే ఒక్క సీటును గెలుచుకునే సీన్ లేని బీజేపీ.. ఏపీలో జ‌గ‌న్ గెల‌వ‌టానికి.. 151 అసెంబ్లీ స్థానాల్ని సొంతం చేసుకోవ‌టానికి తామే కార‌ణ‌మంటూ బీజేపీ నేత ఒక‌రు చేస్తున్న వింత వాద‌న ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానే కాదు.. అవాక్కు అయ్యేలా చేస్తోంది.

జ‌గ‌న్ గెలుపు వెనుక బీజేపీ ఉంద‌న్న మాట‌కు ఎట్టెట్టా? అన్న క్వ‌శ్చ‌న్లు అక్క‌ర్లేద‌ని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ పార్టీ ప‌వ‌ర్లోకి వ‌చ్చిందంటే అందుకు త‌మ పార్టీనే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి.. ఏపీ పార్టీ ఇన్ ఛార్జ్ సునీల్ దియోధ‌ర్. గుంటూరు జిల్లా తెనాలిలో జ‌రిగిన పార్టీ స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న వింత వాద‌న‌ను వినిపించారు.

2014 ఎన్నిక‌ల్లో టీడీపీతో బీజేపీ జ‌త క‌ట్టిన కార‌ణంగానే ఆ పార్టీ గెలిచింద‌ని.. బీజేపీకి ఉన్న భారీ ఓటుబ్యాంక్ మొత్తం టీడీపీ వైపు బ‌దిలీ కావ‌టంతో ఆ పార్టీ గెలిచి ప‌వ‌ర్ లోకి వ‌చ్చింద‌న్నారు. అయితే.. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఊస‌రవెల్లి తీరుతో మోడీని బ‌ద్నాం చేసే ప్ర‌య‌త్నం చేశార‌న్నారు. దీంతో.. టీడీపీతో తెగ‌తెంపులు చేసుకున్నామ‌న్నారు. ఆ కార‌ణంతోనే తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ల‌బ్థి పొందిన‌ట్లు చెప్పారు. ఏపీలో బీజేపీకి ఉన్న 20 శాతం ఓటుబ్యాంకు జ‌గ‌న్ పార్టీకి తోడు కావ‌టంతో.. ఆయ‌న చారిత్ర‌క ఫ‌లితాన్ని సొంతం చేసుకోగ‌లిగార‌న్నారు. స‌ద‌రు సునీల్ మాష్టారు చెప్పిన దాని ప్ర‌కారం బీజేపీకి 20 శాతం ఓట్లు పోతే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు కేవ‌లం 29 శాత‌మే. అయ్య‌గారు చెప్పిన దాని ప్ర‌కారం జ‌గ‌న్ ఓడిపోవాల్సింది. కాకుంటే.. మోడీ పుణ్య‌మా అని ఆయ‌న గెలిచేశారు. వినేవాడు ఉంటే చెప్పేటోడు చెల‌రేగిపోతాడ‌ని ఊరికే అన‌లేదు మ‌రి. నిజంగానే బీజేపీకి 20 శాతం ఓటు బ్యాంకు ఏపీలో ఉండి ఉంటే.. ఈపాటికి ప్ర‌ధాన పార్టీలు ఒక్కొక్క‌టిగా బీజేపీలోకి విలీనం అయ్యేలా చేసి ఉండ‌రు!