Begin typing your search above and press return to search.

టీడీపీకి తొందరలోనే తాళం ?

By:  Tupaki Desk   |   4 Nov 2021 3:53 AM GMT
టీడీపీకి తొందరలోనే తాళం ?
X
తెలంగాణాలో తెలుగుదేశంపార్టీకి తాళం పడినట్లే తొందరలోనే ఏపీలో కూడా పార్టీకి తాళం పడబోతున్నదా ? అవుననే అంటున్నారు బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవధర్ చెప్పారు. దేవధర్ లెక్కల ప్రకారం టీడీపీ అనేది కుటుంబ, అవినీతి పార్టీనట. రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడే 'రాష్ట్రంలో పార్టీ లేదు బొక్కా లేద'ని చేసిన వ్యాఖ్యలను దేవధర్ గుర్తుచేశారు. స్వయంగా రాష్ట్ర అద్యక్షుడే పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడుతు పార్టీలేదు బొక్కాలేదని చెప్పిన తర్వాత పార్టీకి తాళం పడక ఏమవుతుందని ప్రశ్నించారు.

రాష్ట్ర అధ్యక్షుడికే పార్టీ భవిష్యత్తుపై నమ్మకం లేనపుడు అలాంటి పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రశక్తే లేదని తేల్చిచెప్పారు. తమతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ నేతలు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదని దేవధర్ తేల్చిచెప్పేశారు. పార్టీ ప్రతినిధులుగా తాము మాట్లాడే ప్రతిమాట పార్టీ అధిష్టానం చెప్పినట్లుగానే అందరు భావించాలని స్పష్టంగా చెప్పారు. ఒక దశ, దిశలేని టీడీపీతో పొత్తు ఆలోచన కూడా తమకు లేదని స్పష్టంగా చెప్పేశారు.

ఎన్నికల్లో గెలుపు మాత్రమే టార్గెట్ గా చంద్రబాబు ఇతర పార్టీలతో పెట్టుకోని పొత్తులు లేదని, అవసరం తీరిపోయాక ఎన్ని పార్టీలను వదిలేశారో అందరికీ తెలుసన్నారు. బద్వేలు ఉపఎన్నికపై మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు సహకరించిన కారణంగానే 6 వేల ఓట్లు వచ్చినట్లు అభిప్రాయపడ్డారు. తమ పార్టీకి 735 ఓట్లనుండి 21 వేలకు ఓట్లు పెరగిన విషయంలో సంతోషం వ్యక్తంచేశారు. అయితే తమకు అన్నివేల ఓట్లు ఒక్కసారిగా ఎలా పెరిగాయో మాత్రం దేవధర్ బయటపెట్టలేదు.

ఇదే సమయంలో వైసీపీ ఘన విజయాన్ని దేవధర్ చాలా తక్కువగా మాట్లాడారు. అధికారంలో ఉన్నపార్టీ రిగ్గింగుకు పాల్పడటం వల్లే ఇంత మెజారిటి వచ్చిందని తెలిపారు. పనిలోపనిగా ప్రతి ఎన్నికలో కూడా బీజేపీ-జనసేనలు కలిసే పనిచేస్తాయని చెప్పారు. అయితే దేవధర్ చెప్పినట్లుగా రెండుపార్టీల మధ్య సఖ్యత అంతగా లేదని అర్ధమైపోతోంది. రెండుపార్టీలు కలిసి ఐకమత్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపిన నిరసనలు చాలా తక్కువనే చెప్పాలి. ఏ పార్టీకి ఆ పార్టీనే పిలుపిచ్చుకుంటే కార్యక్రమాలు చేస్తున్న విషయం అందరు చూస్తున్నదే.

ఒకవైపు బీజేపీతో పొత్తుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తుంటే ఆ పార్టీ మాత్రం దూరంగానే పెడుతోంది. చంద్రబాబు ఎంతమాత్రం నమ్మదగ్గ వ్యక్తి కాదని దేవధర్ గతంలోనే చెప్పారు. అయితే దేవధర్ అభిప్రాయాలతో టీడీపీలో నుండి బీజేపీలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ విభేదిస్తున్నారు. పొత్తుల గురించి ఆయనెవరు చెప్పటానికి అంటు దేవధర్ ను రమేష్ చాలా తక్కువ చేసి మాట్లాడారు. మరి పొత్తుల విషయంలో ఎవరి మాట చెల్లుబాటవుతుందో చూడాలి.