Begin typing your search above and press return to search.

కాపులు తాకట్టు...ఏంటీ విమర్శలు...అస్థిత్వానికి విలువ ఇవ్వలేరా...?

By:  Tupaki Desk   |   5 Feb 2023 9:44 AM GMT
కాపులు తాకట్టు...ఏంటీ విమర్శలు...అస్థిత్వానికి విలువ ఇవ్వలేరా...?
X
కాపులు ఏపీలో బలమైన సామాజిక వర్గం. కాపులకు ఒక చరిత్ర ఉంది. శతాబ్దాలకు వెనక్కు వెళ్తే రాజ్యాలు ఏలారు. అయిదు వందల ఏళ్ల క్రితం కర్నాటక ఆంధ్ర రాష్ట్రాలను పాలించిన దిగ్గజ చక్రవతి శ్రీకృష్ణదేవరాయలు కాపు జాతి వారే. ఇక స్వాతంత్రపోరాటంలో ఎందరో కాపు యోధులు అసువులు బాసారు. వారిలో సంస్కర్తలు ఉన్నారు. విద్యావేత్తలు ఉన్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో కీలకమైన పదవులు నిర్వహించిన వారు ఉన్నారు. స్వాతంత్రానికి ముందు తరువాత కేంద్రంలో ఎన్నో ముఖ్యమైన పదవులు కాపులు నిర్వహించారు.

కాపు అన్న మాటలోనే కాపాడుతారు అని అర్ధం ఉంది. అంటే వారి ఉనికే ఒక అండ. ఒక అభయం. అన్నం పెట్టే రైతన్నగా. అందరికీ కావాల్సిన మనిషిగా ఊరికి ఉపకారిగా కాపులు ఉంటారు. వారిలో లేనిది స్వార్ధం. నలుగురితో కలిసి మెలసి ఉంటారు. అలాంటి కాపులకు రాజకీయాల్లో అంకెల గారడీ ఎపుడూ మోసం చేస్తోంది. పరమపధ సోపానం అయిన ముఖ్యమంత్రి పదవిని అధిరోహించలేక వారు కొంత నిరాశపడిన మాట వాస్తవం.

అయితే మంచి హృదయంతో విశాల దృక్పధంతో కాపులు ఎపుడూ తగ్గి ఉంటారు తప్ప తమ సామర్ధ్యాన్ని తక్కువ చేసుకుని కాదు. అలాంటి కాపుల విషయంలో ఏపీలోని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు వారి అస్థిత్వాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని అంటున్నారు. కాపులు అంటే తాకట్టుకు పోయేవారు అని అంటున్నారు. వారిని గుత్తమొత్తంగా తాకట్టు పెడుతున్నారు అని వైసీపీ నేతలు అంటే కాదు మీరే జగన్ కి తాకట్టు పెడుతున్నారు అని అవతల వారు అంటున్నారు.

ఇంతకీ కాపులు తాకట్టు పెడితే వెళ్ళిపోయేవారా. వారికంటూ ఒక అభిప్రాయం ఉండదా వారికంటూ ఒక భావన ఉండదా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఈ రోజు అనకాపల్లి జిల్లా పెందుర్తిలో జరిగిన కాపు సంక్షేమ భవనం ప్రారంభోత్సవంలో మంత్రి గుడివాడ అమరనాధ్ కొన్ని రాజకీయ విమర్శలు చేశారు. కాపులను గుత్తమొత్తంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తాకట్టుపెడుతున్నారు అని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వంలో కాపులకు ఎంతో సముచితమైన న్యాయం జరుగుతోంది అని ఆయన లెక్కలు చెప్పారు.

వైసీపీలో దాదాపుగా నలభై మంది దాకా కాపు ఎమ్మెల్యేలు ఉన్నరని, ఎందరో మంత్రులు అయ్యారని, కీకలమైన శాఖలు జగన్ ఇచ్చారని డేటా చెప్పారు. కాపుల కోసం అనేక పధకాల దాకా తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు. మళ్ళీ జగన్ సీఎం అవుతారని,కాపుల మేలు ఆయన చూశారు కాబట్టి ఆయనకే ఓటు వేయాలని గుడివాడ అంటున్నారు.

గుడివాడ ఈ కామెంట్స్ చేయడంతోనే జనసేన నాయకుడు సుందరపు విజయకుమార్ మంత్రి మీద విరుచుకుపడ్డారు. జగన్ గుడివాడకు మంత్రి పదవి ఇచ్చింది పవన్ని తిట్టడానికేనా అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాపులను జగన్ కి తాకట్టు పెడుతోంది గుడివాడేనని అయన ఎదురు దాడి చేశారు. గుడివాడ పదవీ వ్యామోహంలో తమ నేత మీద లేని పోని విమర్శలు చేస్తున్నారు అని ఆయన అంటున్నారు.

సరే ఇద్దరు నేతలు రాజకీయ విమర్శలు ఎన్ని అయినా చేసుకోవచ్చు. కానీ కాపులను మీరు తాకట్టు పెట్టారు అంటే మీరు పెట్టారు అని నిందించుకుని బలమైన సామాజికవర్గం ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఈ కామెంట్స్ ఏంటి అని అంతా అంటున్నారు. తాకట్టు పెట్టడానికి ఎవరికి హక్కు ఉంది. అయినా కాపులు ఒక వస్తువుగా ఉన్నారా అని కూడా ఆ సామాజికవర్గంలో నుంచే నిరసన వస్తోంది.

కాపులు ఎపుడూ నిజాయతీకి నిలబడతారు తప్ప మరి దేనికీ కాదు అంటున్నారు. కాపుల విషయంలోనే ఈ తాకట్టు వంటి పదాలు రావడం కూడా మంచిది కాదని అంటున్నారు. ఇకనైనా నేతలు రాజకీయ విమర్శలు చేసుకోవడానికి పరిమితం అవాలి కానీ కాపులతో సహా ఏ సామాజికవర్గం విషయంలో ఈ తరహా కామెంట్స్ చేయడం తగదనే అంటున్నారు. మరి ఇంతటితో వైసీపీ జనసేన తన విమర్శలు ఆపుతారా లేక ఇంకా కొనసాగిస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఎన్నికల వేళ ఈ హీట్ ఇంకా పెరిగితే మాత్రం ఇబ్బందే అని అంటున్న వారూ ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.