Begin typing your search above and press return to search.

షారుక్ కి సుందర్ పిచ్ఛాయ్ ఓపెన్ ఆఫర్..?

By:  Tupaki Desk   |   14 Aug 2015 4:38 AM GMT
షారుక్ కి సుందర్ పిచ్ఛాయ్ ఓపెన్ ఆఫర్..?
X
సుందర్ పిచ్ఛాయ్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు భారతీయులందరికి సరికొత్త పాఠంగా మారింది. ఆయనకు సంబంధించిన అంశాలు చాలా ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకూ జనబాహుళ్యానికి పెద్దగా పరిచయం లేని ఆయన ఘనత గురించి తెలుసుకున్న వారంతా ఔరా అని ముక్కున వేలేసుకునే పరిస్థితి. గూగుల్ లో అత్యున్నత స్థానానికి ఎదిగిన ఆయన వెనుక.. 14 ఏళ్లుగా గూగుల్ ను వెంటే నడిచిన కష్టం ఉంది. తనకొచ్చిన పెద్ద పెద్ద ఆఫర్లను సింఫుల్ గా వదిలేసిన వైనం ఉంది. ప్రస్తుతం రూ.310కోట్ల ప్యాకేజీతో తన విధులు నిర్వహిస్తున్న సుందర్ పిచ్ఛాయ్ ప్రతిభ కారణంగా గూగుల్ లో ఎన్నో ఉత్పత్తులు సక్సెస్ అయ్యాయి.

ఇవి ఇలా ఉంటే.. ఆ మధ్య అమెరికాకు వెళ్లిన బాలీవుడ్ బాద్ షా షారూక్.. గూగుల్ హెడ్ క్వార్టర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా సుందర్ పిచ్ఛాయ్.. షారూక్ ల మధ్య కాసేపు ముచ్చట్లు సాగాయి. ఈ సందర్భంగా తన గురించిన ఒక విషయాన్ని షారూక్ బయటపెట్టారు. తాను నటుడ్ని కావాలని అనుకోలేదని.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావాలని అనుకున్నానని..కానీ తాను చదువుకునే రోజుల్లో అది చాలా కొత్త ప్రొఫెషన్ అని చెప్పుకొచ్చారు.

ఐటీ కోసం ఐఐటీ ఎంట్రన్స్ పరీక్ష కూడా రాశానని చెప్పుకున్న షారూక్.. ఇప్పుడు మాట్లాడుకున్నంత సింఫుల్ గా అప్పట్లో సాఫ్ట్ వేర్ వ్యవహారం ఉండేది కాదన్నారు. తాను చూసేందుకు స్టుపిడ్ లా ఉన్నా.. ఎలక్ట్రానిక్స్ లో 98 మార్కులు వచ్చినట్లు చెప్పి షారూక్.. అప్పట్లో ఇండియాలో అవే అత్యధిక మార్కులని పేర్కొన్నారు.

షారూక్ విషయాల్ని విన్న సుందర్ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. ఇప్పుడు కానీ ఆయన తన ప్రొఫెషన్ మార్చుకోవాలని భావిస్తే తనకు చెప్పాలని సెలవిచ్చారు. ఇది షారూక్ కు పంచా? లేక.. ఆయనకు ఆయనపై ఉన్న ఆత్మవిశ్వాసమా అన్న విషయంలో తుది అభిప్రాయం ఎవరిష్టం వారిదే.