Begin typing your search above and press return to search.

భారత్ కు సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల సాయం

By:  Tupaki Desk   |   26 April 2021 6:34 AM GMT
భారత్ కు సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల సాయం
X
భారత్ లో కరోనా విలయం చోటుచేసుకుంది. రోజుకు 3 లక్షలకు పైగా కేసులు.. వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా వల్ల ఇదివరకెప్పుడూ చూడని మహా విపత్తును భారత్ ఎదుర్కొంటోంది. ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఇప్పటికే చాలా మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 28 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.

ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను సైతం కదిలిస్తున్నాయి. గత మొదటి వేవ్ లో తమకు సాయం చేసి మందులు, వైద్య సామగ్రి పంపిన భారత్ కు సాయం చేస్తామని తాజాగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు.

ఇక సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు భారీ విరాళాన్ని ప్రకటించాయి. తాజాగా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన వంతు సహకారాన్ని అందించారు. భారత్ కు 135 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన గివ్ ఇండియాకు అందజేశారు. గివ్ ఇండియా ద్వారా యూనిసెఫ్ కు ఈ విరాళాలు అందుతున్నాయి.

యూనిసెఫ్ భారత్ లో వైద్య పరికరాలు, ఆక్సిజన్, ఆక్సిజన్ సంబంధిత ఉపకరణాలను కొనుగోలు చేసి కరోనా పేషెంట్లకు అత్యవసర వైద్య సహాయం అందజేస్తుంది. సుందర్ పిచాయ్ స్ఫూర్తిగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కూడా స్పందించారు.

* భారత్ పరిస్థితి చూసి నా హృదయం ముక్కైలంది: సత్యనాదెళ్ల
భారత్ లో పరిస్థితి చూసి తన హృదయం ముక్కలైందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల అన్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో భారత్ కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన అమెరికాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆక్సిజన్ పరికరాల కొనుగోలులో భారత్ కు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ వనరులను ఉపయోగిస్తుందని సత్య తెలిపారు.