Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీల‌కు స్పీక‌ర్ పిలుపు!

By:  Tupaki Desk   |   22 May 2018 5:28 AM GMT
వైసీపీ ఎంపీల‌కు స్పీక‌ర్ పిలుపు!
X
ఏపీ ప్రత్యేక హోదా విష‌యంలో కేంద్రం నిర్ల‌క్ష్య వైఖ‌రిని నిర‌సిస్తూ కొద్ది రోజుల క్రితం పార్ల‌మెంటులో వైసీపీ ఎంపీలు తీవ్ర‌స్థాయిలో ఆందోళ‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ కేంద్రం మొండివైఖ‌రి వీడ‌కపోవ‌డంతో వైసీపీ ఎంపీలు త‌మ ఎంపీ ప‌ద‌వుల‌ను తృణ ప్రాయంగా వ‌దిలేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల‌నే డిమాండ్ తో పార్లమెంట్ సమావేశాల ముగింపు రోజున తమ ఎంపీ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే, వారి రాజీనామాల‌ను స్పీక‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు ఆమోదించ‌లేదు. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎంపీలతో భేటీ కావాలని లోక్‌ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయించారు. మే 29న తనను కలవాలని వైసీపీ ఎంపీలకు సుమిత్రా మహజన్ లేఖలను ఈ మెయిల్ చేశారు. రాజీనామాల వ్య‌వ‌హారంపై వైసీపీ ఎంపీల‌తో సుమిత్రా మహాజన్ చర్చించబోతున్నారు. ఈ ప్ర‌కారం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి - వైవీ సుబ్బారెడ్డి - వరప్రసాద్‌ - అవినాశ్‌ రెడ్డి - మిథున్‌ రెడ్డిలు 29న స్పీకర్ ను కల‌వ‌బోతున్నారు.

త‌మ ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన త‌ర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ వ‌ద్ద వైసీసీ ఎంపీలు ఆమరణ దీక్ష చేయ‌డం...పోలీసులు ఆ దీక్ష‌ను బ‌ల‌వంతంగా భ‌గ్నం చేయ‌డం తెలిసిందే. వైసీపీ ఎంపీల రాజీనామాల‌ను పునఃస‌మీక్షించుకోవాల‌ని సుమిత్రా మ‌హాజ‌న్ కోర‌గా...వారు నిరాక‌రించారు. త‌మ రాజీనామాల‌పై ఇప్ప‌టివ‌ర‌కు నిర్ణయం తీసుకోలేదంటూ వైసీపీ ఎంపీలు.... స్పీకర్ ను సంప్ర‌దించారు. దీంతో, మే 1న‌ - ఆ తర్వాత మే 7న త‌న‌ను క‌ల‌వాల‌ని స్పీక‌ర్ నుంచి వైసీపీ ఎంపీల‌కు స‌మాచారం వ‌చ్చింది. అయితే, క‌చ్చిత‌మైన తేదీ చెబితే ఆ రోజు క‌లుస్తామ‌ని స్పీకర్ కార్యాలయానికి వైసీపీ ఎంపీలు సమాచార‌మిచ్చారు. దీంతో, మే 29న సాయంత్రం 5-6 గంటల మధ్య త‌న‌ను క‌ల‌వాల‌ని వైసీపీ ఎంపీల‌కు స్పీక‌ర్ ఈ మెయిల్ చేశారు. అయితే, ఎట్టిప‌రిస్థితుల్లోనూ రాజీనామాలు ఆమోదింప‌జేసుకొని ఉప ఎన్నిక‌ల్లో విజయం సాధిస్తామ‌ని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఉప ఎన్నిక‌ల్లో ప్రజల్లోకి వెళ్లి త‌మ చిత్తశుద్ధిని నిరూపించుకుంటామ‌న్నారు.