Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రు మ‌హిళ‌ల్లో ఒక‌రు రాష్ట్రప‌తి!

By:  Tupaki Desk   |   15 Jun 2017 6:55 AM GMT
ఆ ఇద్ద‌రు మ‌హిళ‌ల్లో ఒక‌రు రాష్ట్రప‌తి!
X
రాష్ట్రప‌తి ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో అధికార విప‌క్షాలు త‌మ వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నాయి. ఈ క్రమంలో పేర్ల‌పై క‌స‌ర‌త్తు కొలిక్కివ‌చ్చిన‌ట్లు స‌మాచారం. రాష్టప్రతి పదవికి లోక్‌ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ - జార్కండ్ గవర్నర్ ద్రౌపదీ ముర్ము - ఉప రాష్టప్రతి పదవికి కేంద్ర మంత్రి తావర్‌ చంద్ గెహ్లోట్ పేర్లను బీజేపీ అధినాయకత్వం పరిశీలిస్తోందని స‌మాచారం. లోక్‌ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభ్యర్థిత్వంపై ప్రతిపక్షాలతో ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ద్రౌపదీ ముర్ము పేరును తెరమీదికి తీసుకురావాలని బీజేపీ ఆలోచిస్తుందనే మాట వినిపిస్తోంది. ఉప రాష్టప్రతి పదవికి తావర్ చంద్ గెహ్లోట్ పేరును మాత్రమే బీజేపీ పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా త్రిసభ్య కమిటీ సభ్యులు - కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ వెంకయ్యనాయుడుతో మంతనాలు జరిపినప్పుడు ఈ పేర్లు పరిశీలనకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అరుణ్‌ జైట్లీ - వెంకయ్యనాయుడు - రాజ్‌ నాథ్ సింగ్‌ లు ఎన్డీఏ మిత్రపక్షాలు - ప్రతిపక్ష పార్టీల నాయకులతో చర్చలు జరిపే సమయంలో ఈ పేర్లపై ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేస్తారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ త్రిసభ్య కమిటీ శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి రాష్టప్రతి - ఉప రాష్టప్రతి అభ్యర్థుల ఎంపిక గురించి చర్చించనుంది. బీజేపీ త్రిసభ్య కమిటీ ఆ వెంటనే సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో చర్చలు జరుపుతుంది. వెంకయ్యనాయుడు ఇప్పటికే బీఎస్‌ పీ నాయకుడు ఎస్.సి.మిశ్రా - ఎన్సీపీ నాయకుడు ప్రఫుళ్ల పటేల్‌ తో చర్చలు జరిపారు. అంతకుముందు బీజేపీ నాయకులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి కొత్త రాష్టప్రతి ఎంపికపై పార్టీపరంగా ఇంతవరకు చోటు చేసుకున్న పరిణామాలు - ప్రతిపక్షాలతో జరిపిన చర్చల వివరాలను తెలియజేశారని చెబుతున్నారు.

కొత్త రాష్టప్రతి ఎంపికపై అధికార పక్షంతో మంతనాలు జరిపేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పది మంది ప్రతిపక్ష నాయకులతో ఏర్పాటు చేసిన కమిటీ పార్లమెంటు ఆవరణలోని రాజ్యసభ ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ గదిలో సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. సోనియా గాంధీ ఏర్పాటు చేసిన కమిటీలో గులాంనబీ ఆజాద్‌ తోపాటు లోక్‌ సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే - సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి - సమాజ్‌ వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ - జేడీయూ సీనియర్ నాయకుడు శరద్‌ యాదవ్ - రాష్ట్రీయ జనతా దళ్ అధినాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ - ఎన్‌ సీపీ సీనియర్ నాయకుడు ప్రపుళ్ల పటేల్ - బహుజన్ సమాజ్‌ పార్టీ నాయకుడు సతీష్‌ చంద్ర మిశ్రా - తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓబ్రేన్ - టీఎంకె నాయకుడు భారతి సభ్యులు. పార్లమెంటు ఆవరణలోని గులాం నబీ ఆజాద్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధికార పక్షం వ్యూహంతో లోతుగా చర్చ జరిగింది. త్రిసభ్య కమిటీ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు - బీఎస్‌ పీ నాయకుడు మిశ్రా - ఎన్సీపీ నాయకుడు ప్రఫుళ్ల పటేల్‌ తో జరిపిన మంతనాలపై సమీక్ష జరిగింది. వెంకయ్యనాయుడు చేసిన ప్రతిపాదన - రెండు పార్టీల నాయకులు ఆయనకు ఏం చెప్పారనేది కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు.

బీజేపీ నాయకత్వంలోని ఎన్‌ డీఏకు మెజారిటీ ఉన్నందున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదించే నాయకులే రాష్టప్రతి - ఉప రాష్టప్రతి పదవులకు ఎన్నికవుతారనేది ప్రతిపక్షానికి బాగా తెలుసు. అందుకే రాష్టప్రతి - ఉప రాష్టప్రతి పదవులకు సంఘ్‌ పరివార్ నాయకులు ఎన్నిక కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తుల ఎంపికకు ప్రయత్నిస్తున్నామని ప్రతిపక్షం నాయకులు చెబుతున్నారు.రాష్టప్రతి పదవికి ద్రౌప‌దీ ముర్ము అభ్యర్థిత్వం పట్ల పెద్దగా అభ్యంతరం లేదు కానీ లోక్‌ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభ్యర్థిత్వాన్ని తాము సమర్థించటం సాధ్యం కాదని ప్రతిపక్షం నాయకుల భావ‌న‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/